హీరోగా డ్యూయల్ రోల్ చేస్తూ, దర్శకత్వం వహిస్తూ, నిర్మాతగా బాధ్యతలు చూసుకొంటూ `దాస్ దా ధమ్కీ` రూపొందించాడు విశ్వక్సేన్. నిజంగా.. ఓ యువ హీరో, ఇన్ని విభాగాల్లో దృష్టి పెడుతూ సినిమా చేయడం అంటే గ్రేటే! దర్శకత్వం, నిర్మాణం, నటన.. ఇలా త్రిపాత్రాభినయం చేస్తూ ఓ సినిమా తీసిన యువ హీరో… విశ్వకేనేమో..? ఫలక్ నామా దాస్‌తో విశ్వక్‌కి డైరెక్షన్‌పై గురి కుదిరింది. అయితే.. ఇంత భారీ ప్రాజెక్ట్ ని డీల్ చేయడం కత్తిమీద సామే. ఈ సినిమాతో విశ్వక్ తన కెరీర్‌ని పణంగా పెట్టాడనే అనిపిస్తోంది. కాకపోతే.. ఇప్పుడొస్తున్న బజ్ పై విశ్వక్ హ్యాపీగా ఉన్నాడు. ఈనెల 22న ఉగాది సందర్భంగా ఈ సినిమా విడుదల అవుతోంది. రంగమార్తండ తప్ప.. ఈ సినిమాకి పోటీ లేదు. రంగమార్తాండ కూడా ఈ సినిమాకి పోటీ కాదు. ఎందుకంటే అది వేరే జోనర్. యూత్ అంతా.. దాస్ కా దమ్కీ పైనేఫోకస్ పెడుతుంది. విశ్వక్ కెరీర్లో బిగ్గెస్ట్ రిలీజ్ ఈ సినిమాకి దక్కింది.
సినిమా జనంలోకి వెళ్తే కనుక కనీసం రూ.20 కోట్లయినా థియేటర్ల నుంచి రావడం ఖాయమన్న లెక్కల్లో ఉన్నాడు విశ్వక్. ట్రైలర్ బాగుంది. `పడిపోయిందే పిల్లా` పాట జనంలోకి విపరీతంగా వెళ్లిపోయింది. ఈమధ్య పాటలు సినిమాలకు చాలా ప్లస్ అయిపోతున్నాయి.పాటల కోసమే జనాలు థియేటర్లకు వెళ్తున్నారు. `సార్`లో మాస్టారూ మాస్టారు పాట జనానికి బాగా ఎక్కేసింది. సార్ విజయంలో ఆపాట కీలక స్థానాన్ని ఆక్రమించుకొంది. అలా దాస్ కా దమ్కీ కి..`పడిపోయిందే పిల్లా` పాట ఎట్రాక్షన్ అవ్వబోతోంది. అన్నింటికి మించి దాస్ కా దమ్కీ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి ఎన్టీఆర్ అతిథిగా వచ్చాడు. విశ్వక్పై తన ప్రేమని చూపించాడు. ఎన్టీఆర్ రాకతో.. ఈ సినిమాకి మంచి ప్రమోషన్ లభించినట్టైంది. మొత్తానికి విశ్వక్‌కి అన్ని వైపుల నుంచి శుభశకునాలే కనిపిస్తున్నాయి. మరి తన జాతకం ఎలా ఉందో తెలియాలంటే ఇంకో రెండు రోజులు ఆగాలి.