ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు సుదీర్ఘంగా విచారించి పంపించారు. ఉదయం పదిన్నర సమయంలో ఈడీ ఆఫీసుకు వెళ్లిన కవితను పొద్దుపోయే వరకూ సుదీర్గంగా విచారించారు. సాయంత్రం సమయంలో వైద్యులను పిలిపించి పరీక్షలు కూడా నిర్వహింపచేశారు. అయితే అరెస్ట్ చేస్తారని అనుకున్నారు. కవిత తరపు న్యాయనిపుణులు ఈడీ అధికారుల్ని సంప్రదించినప్పుడు పేపర్ వర్క్ మాత్రమే ఉందని.. అది అయిపోయిన తర్వాత పంపిచేస్తామని చెప్పారు. దాంతో వారు కూడా మీడియాకు అదే చెప్పారు. కానీ ఆ తర్వాత కూడా గంటలు గడిచినా బయటకు రాకపోవడంతో ఉత్కంఠ నెలకొంది.
చివరికి ఆలస్యంగా కవితను వదిలి పెట్టారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ప్రధాన నిందితులందర్నీ ఇప్పటికే అరెస్ట్ చేశారు. వారిలో ఎవరికీ బెయిల్ కూడా రాలేదు. చాలా కాలంగా జైళ్లలోనే ఉంటున్నారు. ఈ ఢిల్లీ లిక్కర్ స్కాం కుట్ర మొత్తం చేసిన టాప్ త్రీలో ఒకరిగా కవితను పేర్కొంటున్నప్పటికీ ఆమెను మాత్రమే అరెస్ట్ చేయలేదు. ఆమెకు మాత్రమే ఎందుకు మినహాయింపునిస్తున్నారని కొంత కాలంగా కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి.
ఉదయం కవిత బినామీగా పేరున్న రామచంద్ర పిళ్లైతో ముఖాముఖి విచారణ జరిపారు. తర్వాత అప్రూవర్‌గా మారిన అమిత్ అరోరాను ముందు కూర్చోబెట్టి ఈడీ అధికారులు విచారణ జరిపినట్లుగా తెలుస్తోంది. కవిత దాఖలు చేసుకున్న పిటిషన్ సుప్రీంకోర్టులో 24వ తేదీన విచారణకు రానుంది. కనీసం అప్పటి వరకైనా అరెస్ట్ చేయకుండా ఉంటారని భావిస్తున్నారు. సుప్రీంకోర్టులో కవిత దాఖలు చేసుకున్న పిటిషన్లో మహిళల్ని ఆఫీసుకు పిలవకూడదని.. అలాగే.. సాయంత్రం ఐదు గంటల తర్వాత విచారించకూడదనే వాదన వినిపించారు. అయితే ఈడీ మాత్రం పొద్దు పోయే వరకూ కవితను ప్రశ్నించారు.