కాటికాపరులు కూడా రోడ్డెక్కారు. తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం సతాయిస్తోదని ఆరోపిస్తూ విజయవాడలో చర్చించుకునేందుకు మీటింగ్ పెట్టారు.. వీరు చాలా కొద్ది మందే ఉంటారు. అంతకు ముందే అంగనా వాడీలు రోడ్డెక్కారు. వారు చేసిన నిరసనలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. ఓ వైపు డీఎస్సీ అభ్యర్థులు.. పారిశుద్ధ్య కార్మికులు..ఇలా దాదాపుగా ప్రతి వర్గం రోడ్డెక్కుతోంది. పోలీసులు వార్ని కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందర్నీ ఇలా రోడ్డెక్కేలా చేస్తున్న ప్రభుత్వం ఇంతకూ అసలు ఏం పరిపాలన చేస్తోంది ?
ఏపీలో అతి తక్కువ జీతం తీసుకునే అంగనా వాడీల దగ్గర్నుంచి పాదయాత్రలో తనను కలిసిన ప్రతి ఒక్కరిగా జగన్మోహన్ రెడ్డి ఎన్ని హామీలు ఇచ్చారో లెక్క లేదు. వాటిలో ఏ ఒక్కటీ అమలు చేయలేదు సరి కదా…. వాటి గురించి చెప్పుకుందామని కనీసం ఇంటి దగ్గరకు రానీయలేదు. ఈ నాలుగేళ్లలో ఆయన ప్రజల్ని కలిసిందే లేదు. ఇటీవల పథకాలకు బటన్లు నొక్కే పని జిల్లాల్లో పెట్టుకుని వెళ్తున్నారు. కానీ ఎవర్నీ కలవరు. రెండంచెల పరదాలు కట్టుకుని వెళ్లి వస్తున్నారు. సీఎం నివాసం దగ్గర ఎప్పుడూ 144 సెక్షన్ ఉంటుంది. చలో అసెంబ్లీ లాంటికార్యక్రమాలు చేపట్టి తమ వాదన వినిపించుకుందామన్నా పోలీసులతో నిర్బంధిస్తున్నారు
జగన్ రెడ్డి ఇచ్చిన హామీలే ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకుంటున్నాయి. ప్రతి ఒక్కర్ని మోసం చేశారన్న భావన ప్రజల్లో పెరుగుతుంది. కనీసం వారికి చెప్పిన హామీల్ని నేరవేర్చే ప్రయత్నం చేయకపోవడం అందర్నీబాధిస్తోంది. అగ్రిగోల్డ్ గురించి గత ప్రభుత్వం సీరియస్గా ఆస్తులు అమ్మి డిపాజిటర్లకు చెల్లించే ప్రయత్నాలు చేస్తూంటే… ఎంత గోల చేయాలో అంతా చేసి ఆపేయించారు.ఇప్పుడు కనీసం ఆ ప్రయత్నం కూడా చేయలేదు. తన రాజకీయం కోసం నమ్మకద్రోహం చేశారని వారు రగిలిపోతున్నారు.
ఇలాంటి అన్ని వర్గాలూ రోడ్డెక్కుతున్నాయి. ఇంత మందిని మోసం చేసిన జగన్ రెడ్డి వారిని ఎంతో కాలం తప్పించుకు తిరగలేకపోవచ్చు. ఎందుకంటే ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి. వారి వద్దకే జగన్ రెడ్డి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.