Rangamarthanda review
రేటింగ్: 2.75/5
గులాబి నుంచి నక్షత్రం వరకూ 20 సినిమాలు చేశారు కృష్ణ వంశీ. ఇందులో కొన్ని క్లాసిక్స్, కొన్ని విజయాలు, ఇంకొన్ని అపజయాలు వున్నాయి. అయితే ఇవన్నీ కూడా ఆయన సొంత కథలే. ‘అంతఃపురం’ని హిందీలో ‘శక్తి’ పేరుతో రీమేక్ చేశారు కానీ ఎప్పుడూ బయట నుంచి కథ తెచ్చుకోలేదు. ఇప్పుడు కెరీర్ లో తొలిసారిగా ఒక రీమేక్ సినిమా ఆయన నుంచి వచ్చింది. అదే ‘రంగమార్తాండ’. మరాఠీలో వచ్చిన ‘నటసామ్రాట్’ని ఆధారంగా తీసుకొని ‘రంగమార్తాండ’ తీర్చిదిద్దారు. కృష్ణ వంశీనే కదిలించిన అంత గొప్ప కథ ఏమైయింటుదనే ఆసక్తి సహజంగానే నెలకొంటుంది. పైగా ‘రంగమార్తాండ’ని సినిమా సర్కిల్ లో వున్న దాదాపు అందరికీ ముందుగానే చూపించేశారాయన. ఇలా చూపించాలన్నా చాలా ధైర్యంగా కావాలి. ‘రంగమార్తాండ’ కృష్ణ వంశీకి ఆ ధైర్యాన్ని ఇచ్చింది. మరి కృష్ణ వంశీకి ఇది కమ్ బ్యాక్ చిత్రమైయిందా? వంశీ ప్రేక్షకుల్ని మెప్పించే సినిమా తీయగలిగాడా?
రాఘవరావు( ప్రకాష్ రాజ్) దిగ్గజ రంగస్థల నటుడు. తన నటనతో ప్రేక్షకుల అభిమాన్ని, కీర్తి ప్రతిష్టలని సంపాదిస్తాడు. అభిమానులు ఆయన్ని ‘రంగమార్తాండ’ అనే బిరుదుతో స్వర్ణ కంకణం తొడిగి ఘనంగా సన్మానిస్తారు. అదే సన్మాన సభలో తన విశ్రాంత ప్రకటన చేస్తాడు రాఘవరావు భార్య (రమ్యకృష్ణ). గంగిగోవు లాంటి వ్యక్తి. రాఘవురావును భరించే ఏకైక మనిషి. రాఘవరావు మిత్రుడు చక్రపాణి (బ్రహ్మనందం). ఆయన కూడా రంగస్థల నటుడే. ఇద్దరూ అన్నదమ్ముల్లా, స్నేహితుల్లా వుంటారు.
రాఘవరావు కొడుకు రంగారావు(ఆదర్స్ బాలకృష్ణ). భార్య చాటు భర్త. తండ్రి అంటే భయం. రాఘవరావు చాలా భోళా మనిషి. కోడలు ( అనుసూయ భరద్వాజ్ ) పేరుపై ఇల్లు రాసేస్తాడు. భార్యదాచి పెట్టిన సేవింగ్స్, బంగారం.. కూతురి శ్రీ (శివాత్మిక )కి ఇచ్చేస్తాడు. ప్రేమించిన అబ్బాయితో కూతురు పెళ్లి చేస్తేస్తాడు. ఇక అన్నీ భాద్యతలు తీరిపోయాయి, తనను ఇంతకాలం కంటికి రెప్పలా కాపాడుకున్న భార్యతో ఆనందంగా శేష జీవితం గడపాలను కున్న రాఘవరావుకి.. జీవితం ఊపిరాడనివ్వకుండా చేస్తుంది. రంగస్థలంపై ఎంతో గొప్పగా నటించిన రాఘవరావు.. జీవితమనే నాటకంలో ఎలా తేలిపోయాడు ? ‘రంగమార్తాండ’ రాఘవరావుకు సంసారమనే నాటకం, పిల్లలు అనుకునే పాత్రలు ఎలాంటి పాఠాలు నేర్పాయి? జీవితాంతం తనని నమ్ముకొన్న భార్యకు, స్నేహితుడు చక్రికి ఎలాంటి న్యాయం చేశాడు ? చివరికి రాఘవరావు నిజ జీవిత పాత్ర ఎలా ముగిసింది ? అనేది ‘రంగమార్తాండ’ కథ.
మరాఠీలో ‘నటసామ్రాట్’ ఆత్మని తీసుకొని ఈ కథని చేశానని చెప్పారు కృష్ణ వంశీ. నిజమే.. మరాఠీ వెర్షన్ కి దీనికి చాలా మార్పులు వున్నాయి. నటసామ్రాట్ షేక్స్పియర్ నాటకాల చుట్టూ ఎక్కువగా తిరిగితే.. రంగమార్తండ మాత్రం తెలుగు నాటకాలు, సన్నివేశాలని చక్కగా కథలోకి ఇముడ్చుకొని కోర్ పాయింట్ మాత్రం ‘అమ్మానాన్నల కథ’ పై ఎక్కువగా ద్రుష్టి సారించారు కృష్ణ వంశీ. అదే రంగమార్తాండలోని భావోద్వేగాలకు పెద్దపీట వేసింది.
కనిపించకుండా పోయిన రాఘవరావు కోసం కొడుకు కూతురు వెదుకుతున్న సన్నివేశంతో కథని చాలా ఆసక్తికరంగా మొదలుపెట్టారు. అంతకుముందు చిరంజీవి వాయిస్ ఓవర్ తో నేనొక నటుడ్ని షాహెరీ అందులో పోస్ట్ చేసిన ప్రముఖ నటుల చిత్రాలు ఒక నాస్టాలిజిక్ ఫీలింగ్ ని ఇస్తాయి. రాఘవరావు తన గతం చెప్పుకోవడంతో అసలు కథ మొదలౌతుంది. మొదట్లో కాస్త నెమ్మదిగా అనిపించిన కథనం.. ఎప్పుడైతే రాఘవరావు రంగస్థలంపై విశ్రాంతి తీసుకొని జీవితం అనే నాటకంలోకి అడుగుపెడతాడో.. తర్వాత ఒకొక్క సన్నివేశం ఆసక్తికరంగా ముందుకు వెళిపోతుంది. భార్యతో రాఘవకి వున్న అనుబంధం, పిల్లలు తండ్రిని చూసే కోణం, రాఘవ, చక్రికి వున్న స్నేహం.. తన భార్య పట్ల చక్రికి వున్న ప్రేమ.. ఇవన్నీ కథని ముందుకు తీసుకెళ్తాయి.
తొందరపడి ఆస్తిని పంచిన రాఘవరావుని భార్య వారించినపుడే కథ ఎటువైపు ప్రయాణిస్తుందో ప్రేక్షకుడికి ఒక అంచనా అందుతుంది. అయితే రంగస్థలంపై తప్పితే నిజజీవితంలో నటించలేని అమాయకుడైన రాఘవరావు పాత్ర.. కథపై ఆసక్తిని తగ్గిపోనివ్వకుండా ముందుకుతీసుకెళుతుంది. విరామానికి ముందే వచ్చే సన్నివేశాలు మాత్రం కంటతడి పెట్టించేస్తాయి. ‘’ఆనందం.. రెండు విషాదాల మధ్య విరామం’’ అన్న ఇంటర్వెల్ బాంగ్.. పాపం రాఘవరావు దంపతుల పరిస్థితి ఏమిటనే ఆందోళన, ఆవేదన కలిగించేలా వుంటుంది.
గుండెని బరువెక్కించిన విరామం తర్వాత.. కాసేపు ఉల్లాసంగా ఉంచడానికి పొదల పొదల గట్ల నడుమ, దమిడి సేమంతి అనే పాటలు దాని చుట్టూ కొన్ని సన్నివేశాలు వస్తాయి. పోనీలే.. రాఘవ, రాజు గారు హాయిగా వున్నారనే అనందం ఎంతో సేపు నిలవదు. చక్రి పాత్ర రూపంలో మరో బలమైన బరువైన అంకానికి తెరలేపుతారు కృష్ణ వంశీ. భార్య చనిపోవడం చక్రీ అనాధగా మిగిలిపోవడం, ఒంటరితనంతో డిప్రెషన్, హాస్పిటల్ లో చేరిన తర్వాత ‘’ముక్తిని ఇవ్వరా’’ అని రాఘవని అడగడం ఇవన్నీ మనసుని బరువెక్కిస్తాయి. అంతకుముందు రాఘవని చక్రి కొట్టిన చెంప దెబ్బ స్నేహాన్ని ఎంతో సహజంగా చాటుతుంది. ఇక హాస్పిటల్ లో చక్రి, రాఘవ మధ్య జరిగే కురుక్షేత్ర కర్ణ-సుయోధన సన్నివేశం రంగస్థలాన్ని ప్రేమించే ప్రేక్షకులకు, ఆ నేపధ్యం తెలిసిన వారికి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ ఘట్టం తర్వాత ఇంకెక్కువ కాలయాపన చేయకుండా క్లైమాక్స్ ని తెరపైకి తీసుకొస్తారు కృష్ణ వంశీ. ఈ కథకు ముగింపు మాత్రం గుండెల్ని పిండేస్తుంది.
నిజానికి ఈ కథలో ఎవరూ విలన్స్ లేరు. మార్పులు, పరిస్థితులు, పాత కొత్త తరాలు, నమ్మకాలు విలువలు.. ఇలా చాలా లోతైన అంశాలని ఈ కథ చర్చిస్తుంది. రిలేషన్స్, ఎటాచ్మెంట్స్ కాలానుగునంగా ఎలా మారిపోతున్నాయి ? పిల్లల విషయంలో అమ్మానాన్నలు ఎలా జాగ్రత్తగా వుండాలి? మారిపోతున్న పరిస్థితులని ఎలా అర్ధం చేసుకోవాలి ? పిల్లలు ఎంత ప్రాక్టికల్ గా మారిపోతున్నారు ? కాళ్ళ మీద నిలబెట్టిన తల్లితండ్రులని.. నిలబడిన పిల్లలు ఎలా చూస్తారు ? అసలు వాళ్లకి తల్లితండ్రుల నుంచి ఏం కావాలి ? అమ్మానాన్నల ఫీలింగ్స్ పిల్లలకు అసలు అర్ధమౌతున్నాయా ? అర్ధం చేసుకునేంత సమయం వాళ్ళకి వుంటుందా ? ఇలా అనేక కోణాల్లో ఈ కథ కనబడుతుంది.
రంగమార్తాండ కొత్త కథేం కాదు. అందరి తెలిసిన కథ.. ఎక్కడో విన్న కథ.. కుటుంబాల్లో చూసిన కథే. అయితే ఈ కథని ప్రత్యేకంగా నిలిపింది మాత్రం నటీనటుల అభినయం, కృష్ణ వంశీ బలంగా నమ్మిన భావోద్వేగాలు. ప్రకాష్ రాజు అద్భుతమైన నటుడు. రంగమార్తాండ రాఘవరావు పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. ఒక రెండు సీన్లు తర్వాత తెరపై కనిపిస్తుంది ప్రకాష్ రాజ్ అనే సంగతి మర్చిపోయి రాఘవరావుతో ప్రయాణిస్తాం. రంగస్థలంపై తప్పితే జీవితంలో నటించడం చేతకానీ వ్యక్తి పాత్రలో అతని నటన అమోఘం. దర్శకుడు కృష్ణ వంశీ ప్రకాష్ రాజ్ లోని సంపూర్ణ నటుడిని వాడుకున్న తీరు భలే అనిపిస్తుంది. కూతురు దొంగతనం మోపినపుడు రాఘవరావుకి కాసేపు ఏం అర్ధం కాదు.. భార్య చెబితే కానీ కూతురు తనని దొంగ అంటుందని అర్ధం చేసుకొలేని అమాయక చక్రవర్తి. ఇక్కడే ప్రకాష్ రాజ్ ఎంత గొప్పనటుడో అర్ధమౌతుంది. తనని దొంగ అంటుందని తెలిసిన తర్వాత రాఘవరావు నుంచి వచ్చే రియాక్షన్ చూస్తే ‘’నిజమేరా.. వీడికి నటించడం రాదు. నిజ జీవితంలో చెత్త నటుడు’’ అని అనాలనిపించేలా వుంటుంది. ఇదే కాదు చాలా సన్నివేశాల్లో ఆయన నటన అండర్ లైన్ చేసుకొని ప్రస్థావించేంత గొప్పగా వుంటుంది.
రంగమార్తాండలో గొప్ప ఆశ్చర్యం బ్రహ్మనందం. చక్రపాణి పాత్ర కోసం కృష్ణ వంశీ, బ్రహ్మనందంని ఎంపిక చేసినప్పుడు..ఆ పాత్ర ఇమేజ్ కి బ్రహ్మనందం సరిపోతారా ? రాంగ్ ఛాయిస్ అని చాలా మంది అనుకున్నారు. కానీ కృష్ణ వంశీ బ్రహ్మనందాన్ని మరో కోణంలో చూశారు. ఇప్పటివరకూ ఏ దర్శకుడు చేయని సాహసం చేసి చక్రపాణి లాంటి సీరియస్ పాత్ర చేయించారు. మొదటి సీన్ లో బ్రహ్మనందంపై ఒక క్లోజప్ కూడా వేయని కృష్ణ వంశీ తర్వాత ఆ పాత్రని ఇంతింతై వటుడింతై అన్నట్టుగా పెంచుకుంటూ వెళ్లారు. రాఘవరావు-చక్రిల మైత్రీని కృష్ణ వంశీ తీర్చిన్దిద్దిన తీరు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. వాళ్ళు మాట్లాడుకునే మాటలు చాలా సహజంగా వుంటాయి. ‘’ఒరేయ్ చెత్త నా కొడకా’’ అని చక్రపాణి అంటే.. అది పరుష పదజాలంలా అనిపించదు. చిన్నప్పుడు ఒకే బెంచ్ పై కూర్చిని కబుర్లు చెప్పుకున్న కల్మషం లేని స్నేహితుల్లా అనిపిస్తారు. రాఘవరావుని చెంపదెబ్బకొట్టి తన కోపాన్ని ప్రదర్శించిన చక్రపాణి.. కాసేపటికి ‘’ఎరా దెబ్బగట్టిగా తగిలిందా?’ తన బుగ్గని నిమిరిన సీను.. తెలుగు సినిమాల్లో అరుదైన స్నేహ సన్నివేశాల్లో ఒకటిగా నిలిచిపోతుంది. హాస్పిటల్ బెడ్ ని రంగస్థలంగా చేసుకొని రాఘవరావు చక్రపాణి చూపిన నట విశ్వరూపం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ సీన్లో జాతీయ అవార్డు గ్రహీత ప్రకాష్ రాజ్ కూడా బ్రహ్మానందం ముందు తేలిపోతాడు. అక్కడ కంట తడి పెట్టని ప్రేక్షకుడు ఉండడు అని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి కాదు.
స్త్రీ పాత్రలని తీర్చిదిద్దడంలో కృష్ణ వంశీది సెపరేట్ మార్క్. ఇందులో కూడా మూడు స్త్రీ పాత్రలు కనిపిస్తాయి. రాజు గారి పాత్రలో రమ్యకృష్ణ. రాజమాత శివగామి తర్వాత రమ్యకృష్ణ పాత్ర చేసిన మరో ప్రధానమైన పాత్రది. ఈ పాత్రలో చాలా మంది తమ అమ్మని చూసుకుంటారు. కేవలం కళ్లతోనే భావాలు పలికించింది. ఆమె చూపులోనే చాలా లోతైన భావాలు కనిపిస్తాయి. ఈ పాత్రని ముగించిన తీరు చూస్తే అప్రయత్నంగా కన్నీళ్లు వచ్చేశాయి. మరో స్త్రీ పాత్ర శ్రీ పాత్రలో కనిపించిన శివాత్మికది. తల్లితండ్రులపై ఎంతో ప్రేమ ఆప్యాయత వున్న పాత్ర. అయితే తనకి తన కంఫర్ట్ మాత్రమే ముఖ్యం. తన జీవితానికి ఎవరైన ఇబ్బంది కలిగిస్తే సహించే పాత్ర కాదు. చివరికి తల్లితండ్రులైనా సరే. ఏ మాత్రం అటు ఇటు అయినా నెగిటివ్ అయిపోయే ఈ పాత్రని శివాత్మిక చాలా బ్యాలెన్స్ గా చేసింది. కోడలు పాత్రలో కనిపించిన అనసూయ భరద్వాజ్ .. తన భర్త బిడ్డలు చాలనుకునే ప్రాక్టికల్ పాత్రలో కనిపించింది. రాజీపడిపోయే భర్తలో పాత్రలో అదర్స్ బాలకృష్ణ కనిపించారు. రాహుల్ సింప్లిగంజ్ చేసిన అల్లుడి పాత్ర మాత్రం చాలా పాజిటీవ్ కోణంలో సాగుతుంది. అత్తమామలు ఇలాంటి అల్లుడు రావాలని కోరుకునే పాత్ర. అలీరెజా పాత్ర కూడా కథ ముందుకు నడిపేదే. మిగతా నటీనటులు పరిధిమేర కనిపించారు.
ఇళయరాజా సంగీతం రంగమార్తాండకు మరో ప్రధాన ఆకర్షణగా నిపిచింది. నన్ను నన్నుగా, పొదల పొదల గట్ల నడుమ, దమిడి సేమంతి పాటలు ఒకెత్తు. పువ్వై విరిసే ప్రాణం పాట మాత్రం కథలో సన్నివేశానికి తగట్టు సిరివెన్నెల అద్భుతమైన సాహిత్యం మనసుల్ని తాకుతూనే వుంటుంది. ఈ పాటనే దాదాపు నేపధ్య సంగీతంగా వాడారు. కెమెరాపని తనం డీసెంట్ గా వుంటుంది. నిర్మాణంలో కొన్ని పరిమితులు కనిపించాయి. ఈ చిత్రంలో మాటలు మరో ప్రధాన ఆకర్షణ. చాలా మంది ప్రముఖ రచయితలు తమ రచనల్లో, నాటకాల్లో రాసిన మాటలు రాఘవరావు పాత్ర ద్వార మళ్ళీ వినే అవకాశం దొరికింది. ‘’నటుడికైనా నటరాజుకైనా చివరికి మిగిలేది స్మశాన వసంతమే’’ లాంటి బరువైన మాటలు ఎన్నో వినిపిస్తాయి. చిరంజీవికి పలికిన షాహెరీ.. నటుడి జీవితాన్ని కళ్లముందుకు తీసుకొస్తుంది. రంగమార్తాండకు ఇదో అద్భుతమైన శ్రీకారంలా మారింది.
పెద్దలెప్పుడూ మంచి విషయాలే చెబుతారు. కానీ వినేవాళ్లకు అది కాస్త నసలా ఉంటుంది. ఇందులోనూ కొన్ని సస పెట్టే సన్నివేశాలు, సందర్భాలు వస్తాయి. లాగ్ అనిపించే ఫీలింగ్ తెస్తాయి. కానీ.. అవన్నీ భరించాలి. ఎందుకంటే… బేసిగ్గా అవన్నీ మంచి విషయాలు కాబట్టి. సినిమా తీస్తున్నప్పుడు ఏమాత్రం కమర్షియల్ కోణంలో ఆలోచించకుండా, ఓ మంచి విషయాన్ని చెప్పాలి అనుకొన్న కృష్ణవంశీ అభినందనీయుడు.
‘రంగమార్తాండ’తో ఒక జీవితాన్ని చిత్రీకరించి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు కృష్ణ వంశీ. మంచి సినిమాలు రావడం లేదని చాలా సార్లు ప్రేక్షకుల నుంచి వచ్చే ఫిర్యాదు. రంగమార్తాండ మంచి సినిమానే. మరా మంచి సినిమానే ఎంతలా ఆదరిస్తారనేది మాత్రం ప్రేక్షకుల చేతిలోనే వుంది.
రేటింగ్: 2.75/5