ఏకంగా సీఎం జగన్ ఫోటోను వాట్సాప్ డీపీగా పెట్టుకుని ఇతర రాష్ట్రాల్లో తాను జగన్ పీఏనని చెప్పి పారిశ్రామికవేత్తల్ని కోట్లలో ముంచాడు బుడమూరు నాగరాజు అనే మోసగాడు. ఈయన ఇలా మోసాలు ఎన్నో సార్లు చేశాడు. కానీ పోలీసులు ఏమీ చేయలేకపోయారు. పైగా ఓ సందర్భంగా కోడెలపై ఆరోపణలకు ఆయనను పోలీసులు, వైసీపీ నేతలు వాడుకున్నారు. దీంతో ఆయన మరింత చొరవ తీసుకుని జగన్ ఫోటోతోనే మోసాలు ప్రారంభించారు. ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు నాగరాజును అరెస్ట్ చేయడంతో విషయం తెలిసింది. పట్టుకుంది ఏపీ పోలీసులు కూడా కాదు.
ఈ వ్యవహారం ఇలా ఉంటే… ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారినంటూ ఓ వ్యక్తి వికాస్ మన్రాత్ ఐఏఎస్ పేరుతో సోషల్ మీడియాలో అకౌంట్ తెరిచి మోసాలకు పాల్పడుతున్నారు. 2019 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారినని ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల విభాగానికి జాయింట్ కమిషనర్‌గా ఉన్నానని ఆయన తన ట్విట్టర్ అకౌంట్లో చెప్పుకున్నారు. జీ ఈ అకౌంట్ నుంచి తాజాగా ఆయన విరాళాలు సేకరించడం ప్రారంభించారు. ఈ విషయం చాలా ఆలస్యంగా ప్రభుత్వానికి తెలిసింది.
చివరికి వికాస్ మన్రాత్ పేరుతో అసలు ఐఏఎస్ అధికారే లేరని తేలడంతో ఎవరో మోసం చేయడానికి ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశారని గుర్తించారు., వికాస్ మన్రాత్ పేరుతో ఐఏఎస్ అధికారి లేడని ఫ్యాక్ట్ చెక్ కూడా ప్రకటించింది. అయితే ఇప్పటికే కొంత మంది మోసపోయినట్లుగా ప్రచారం జరుగుతోంది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేశారు. విషయం తెలిసిందేమో కానీ అతను.. తన ట్విట్టర్ ఖాతా నుంచి విరాళాలు అడుగుతున్న పోస్టును తొలగించారు. అయితే పకడ్బందీగా మోసం చేయడానికి ఫేక్ ఐఏఎస్ పేరుతో ఈ ఖాతాలు నిర్వహిస్తున్నారని గుర్తించిన పోలీసులు చర్యలు తీసుకునేందుకు రంగంలోకి దిగారు. కనీస భయం లేకుండా మోసగాళ్లు ఇలా ప్రభుత్వాన్ని వాడేసుకోవడం ఏమిటన్న దానిపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.