బీజేపీ సహకరించి ఉంటే.. టీడీపీ అవసరం లేకుండా ఎదిగేవాళ్లమని. కానీ ఆ అవకాశం చేజారిపోయిందని ఆవిర్భావ సభలో పవన్ చేసిన వ్యాఖ్యలు అక్షరాలా నిజం అని బీజేపీ నేతలు మరోసారి నిరూపించారు. జనసేన కలిసి రావడం లేదన్నట్లుగా నిందలు వేయడంతో అసలు విషయపై జనసేన వర్గాలకు క్లారిటీ వస్తోంది. పొత్తు పేరుతో ట్రాప్ చేసి జనసేన ఎదుగకుండా చేసి.. తమను వీలీనం చేసుకోవాలన్న కుట్ర చేశారన్న అనుమానాలు జనసైనికుల్లో బలపడుతున్నాయి.
పొత్తు పేరుతో జనసేన కాళ్లూ చేతులు కట్టేసిన బీజేపీ
సాధారణంగా రాజకీయ పొత్తులు అనేవి ఎన్నికల సమయంలోనే ఉంటాయి. కానీ పవన్ రాష్ట్రం కోసం ఎన్నికలు అయిపోయిన తర్వాత బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్రం అథోగతి పాలవుతూండటంతో బీజేపీ రాష్ట్రాన్ని కాపాడుతుందన్న ఉద్దేశంతో పవన్ పొత్తు నిర్ణయం తీసుకున్నారు. కానీ అలా పొత్తు ప్రకటన చేసిన తర్వాత కలిసి చేయాల్సిన ఉద్యమాలు కాస్తా పూర్తిగా ఆగిపోయాయి. జనసేన ప్రకటించిన కవాతు కూడా జరగలేదు. ఓ సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకుని కలిసి పని చేద్దామనుకున్నారు కానీ.. ఆ కమిటీలు కాదు కదా ఏమీ లేవు. పొత్తు ప్రకటన చేశారు కానీ.. కలిసి పని చేసిందే లేదు. మొత్తంగా వైసీపీకి మద్దతు పెరిగిపోయింది. నాలుగేళ్లలో రాష్ట్రం నాశనమైపోయింది.
పొత్తు పేరుతో జనసేనను ఎన్నికల్లో పోటీ చేయకుండా కట్టడి – బలహీనం చేసే కుట్ర
తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లో బీజేపీకి జనసేన మద్దతిచ్చినా ఏడు నియోజకవర్గాల్లో కలిపి కేవలం 57వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. డిపాజిట్ రాలేదు. అంతకు ముందు సాధారణ ఎన్నికల్లో బీజేపీకి 16 వేల ఓట్లు వచ్చాయి. జనసేన కలిసిన తర్వాత మరో 30 వేల ఓట్లు పెరిగాయి. నిజానికి పవన్ కల్యాణ్ కు మద్దతిచ్చే వర్గం ఎక్కువగా ఆ ప్రాంతంలో ఉందని చెప్పుకుంటారు. కానీ ఆ స్థాయిలో ఓట్లు రాలేదు. దీంతో బీజేపీ, జనసేన పొత్తు వర్కవుట్ కావడం లేదన్న అభిప్రాయం ప్రారంభమయింది.
జనసేన బలాన్ని తన బలంగా చెప్పుకోవాలనే ప్రయత్నం – చివరికి తెలుసుకున్న జనసేన
తర్వాత స్థానిక ఎన్నికల్లో బీజేపీ, జనసేన పొత్తులపై చర్చించుకోలేదు. కనీసం పొత్తులు పెట్టుకోవాలన్న ఆలోచన కూడా చేయలేదు. ఎవరికి వారు పోటీ చేసుకున్నారు. కోస్తాలో కొన్ని చోట్ల టీడీపీ, జనసేన స్థానిక నాయకత్వాలు పొత్తులు పెట్టుకుని పోటీ చేసి మంచి ఫలితాలు సాధించాయి. అదే సమయంలో బీజేపీతో పొత్తు వల్ల ముస్లింలు ఓట్లేయట్లేదని జనసేన నేతలు గగ్గోలు పెట్టారు. పొత్తు పేరుతో తమ చేతులు కట్టేసి.. ఏమీ చేయకుండా చేయనివ్వకుండా చేసి విలీన ప్రతిపాదనలు పెట్టారన్న ఆగ్రహం జనసేన నేతల్లో ఉంది. ఇప్పుడు తాము కాదు జనసేనే కలసి రావడంలేదన్నట్లుగా ప్రచారం చేయడం మరింత కలకలానికి కారణం అవుతోంది.