తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగ పరీక్షల లీకేజీల వ్యవహారం ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారింది. ఎన్నో ఏళ్ల తర్వాత ప్రభుత్వం ప్రకటించిన నోటిఫికేషన్లన్నింటిపై అనుమానాలు వచ్చేలా ఈ వ్యవహారం చేసింది. దీంతో అసలు ఆగ్రహంతో ఉన్న నిరుద్యోగులు మరింతగా ప్రభుత్వంపై మరింత ఫైర్ అయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు వారిలో విశ్వాసం నెలకొల్పాల్సిన పరిస్థితి ప్రభుత్వంలో ఏర్పడింది. ఇందు కోసం కఠిన చర్యలు తీసుకోవాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లుగా తెలుస్తోంది.
తెలంగాణ నిరుద్యోగులకు నమ్మకం కలిగిస్తూ పరీక్షలు ఎలా నిర్వ హంచాలన్న అంశంపై కేసీఆర్ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రద్దు చేసిన పరీక్షలను ఇప్పటికిపుడు మళ్లి పెట్టినా అనుమానాలు చెలరేగే ప్రమాదం ఉందనే అభిప్రాయం ఎక్కువగా వ్యక్తమవుతున్నాయి. అన్ని పరీక్షలు రద్దుచేసి అత్యంత పారదర్శక విధానం తీసుకురావాలని, 90 రోజుల్లో పరీక్షలు పూర్తిచేయాలనే ఆలోచనతో సీఎం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
పేపర్ల లీకేజీ వ్యవహారంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు, విమర్శలు బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. ఓ వైపు లిక్కర్ కేసులో కవిత విచారణ ఎదుర్కొంటున్నారు. కవిత ఈడీ ఆఫీసుకు విచారణకువెళ్తే సీనియర్ మంత్రులు ఢిల్లీలోనే ఉంటున్నారు. దీంతో విపక్షాల విమర్శలకు ఎదురుదాడి చేయడం తగ్గిపోయింది. తెలంగాణలోని ప్రతీ అంశంపై తనకంటే ఎక్కువ బాధ్యత ఎవరికీ లేదని, ఉద్యమనేతగా తనకే ఇక్కడి యువతపై బాధ్యత ఉందని.. నమ్మకం కలి గించేందుకు కేసీఆర్ సందర్భం లేకపోయినా సోమవారం బహిరంగ లేఖ రాశారన్న అభిప్రాయం వినిపిస్తోంది ఓ వైపు కవితపై లిక్కర్ కేసులో విచారణ.. మరో వైపు ప్రభుత్వానికి అప్రతిష్ట వచ్చే ప్రమాదం ఉండడంతో దీని తీవ్రతను తగ్గించేందుకు సీఎం కేసీఆర్ సెంటిమెంట్ ప్రయోగిస్తున్నారని అంటున్నారు.