ఎవరైనా పెళ్లి చేసుకున్న తర్వాత విడాకుల గురించి మాట్లాడారు. కానీ జనసేన నాయకులు మాత్రం పెళ్లి చేసుకోక ముందే విడాకులు ఇచ్చేస్తామని హెచ్చరిస్తున్నారు. వారి తీరు చూసి టీడీపీ సోషల్ మీడియా సెటైర్లు వేస్తోంది. ఇలాంటి వారిని పెట్టుకుని పవన్ కల్యాణ్.. రాజకీయం చేస్తున్నారని… అందరూ కలిసి ఆయనను కనీసం అసెంబ్లీకి కూడా వెళ్లకుండా చేస్తారని సెటైర్లు వేస్తున్నారు.
టీడీపీతో పొత్తు గురించి ఇప్పటి వరకూ చర్చించలేదని స్వయంగా పవన్ కల్యాణ్ ఆవిర్భావ సభలో ప్రకటించారు. నిజానికి కలిసి పోరాటం చేయాలన్న అంశంపైనే మాట్లాడుకున్నారు. కానీ పొత్తులు.. సీట్ల సర్దుబాటు గురించి మాట్లాడుకోలేదు. అయితే చేగొండి హరిహామజోగయ్య, బొలిసెట్టి సత్య లాంటి సీనియర్ నేతలు… అప్పుడే టీడీపీతో విడిపోతామని ప్రకటనలు చేశారు. చేగొండి హరిరామజోగయ్య అయితే మరింత ముందుకు వెళ్లి మా దారి మేము చూసుకుంటామని హెచ్చరింంచారు. ఎందుకంటే స్కిల్ స్కామ్ లో చంద్రబాబు నిజాయితీని నిరూపించుకోవాలట. అసెంబ్లీలో జగన్ స్కిల్ స్కామ్ పై దత్తపుత్రుడు ఎందుకు మాట్లాడడు అని ప్రశ్నించారు.
దీంతో హరిహామ జోగయ్య… ఎగేసుకుని వచ్చేశారు. చంద్రబాబు నిజాయితీ నిరూపించుకోవాలని చెబుతూ.. పవన్ కల్యణ్ భుజంపై తుపాకీ పెట్టి.. ఆయన చెప్పే సిద్దాంతాలను గుర్తు చేసి… తాము టీడీపీని వదిలేసి వేరే దారి చూసుకుంటామన్నారు. జోగయ్య తీరుపై చాలా మంది జనసేన నేతల్లోనే సందేహాలు ఉన్నాయి. ఈ లేఖ చూసిన తర్వాత మరింత అనుమానపడుతున్నారు. అసలు పొత్తే లేదు వేరే దారి చూసుకోవడం గురించి ఎందుకు మాట్లాడుతున్నారని అనుమానిస్తున్నారు. పాలకొల్లులో చిరంజీవిని ఓడగొట్టిన దగ్గర్నుంచి జోగయ్య చేసిన వ్యవహారాలపై జనసైనికుల్లో ఓ అవగాహన ఉంది. కానీ అవగాహనను తెలివిగా వాడుకునేవారు తక్కువ.
ఇక బొలి సెట్టి సత్య గురించి చెప్పాల్సిన పని లేదు. ఆయన వైసీపీ నేతల వాదనను జనసేన కోణంలో వినిపిస్తూ ఉంటారు. ఈ ఇద్దరి తీరుపై….. జనసేనలోని కొన్ని కీలక వర్గాల్లో అనుమానాలు ప్రారంభమయ్యాయి. వీరు ప్రత్యేక అజెండాతో పని చేస్తున్నారని అంటున్నారు.