కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీకి గుజరాత్లోని సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. మోదీని విమర్శించినందుకు దాఖలైన పరువు నష్టం పిటిషన్పై విచారణ జరిపిన సూరత్ కోర్టు ఈ మేరకు తీర్పును వెలువరించింది. కోర్టుకు రాహుల్ గాంధీ కూడా హాజరయ్యారు. 2019లో కర్ణాటకలో రాహుల్ గాంధీ నిరవ్ మోదీ, లలిత్ మోదీలతో పాటు ప్రధాని నరేంద్రమోదీని ఉద్దేశించి మోదీ ఇంటిపేరు ఉన్న వారంతా దొంగలేనని విమర్శించారు. ఇది బీజేపీ నేతలకు కోపం తెప్పించింది.
రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే, గుజరాత్ మాజీ మంత్రి పూర్ణేశ్ మోదీ రాహుల్ గాందీపై కేసు పెట్టారు. ” నీరవ్ మోడీ , లలిత్ మోడీ లేదా నరేంద్ర మోడీ వంటి దొంగలందరి పేర్లలో మోడీ ఎందుకు ఉన్నారు” అని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారని ఇది తమ మనోభావాలను దెబ్బ తీసిందని ఆయన కోర్టుకు వెళ్లారు. దీనిపై సూరత్ కోర్టు విచారణ జరిపింది. భారత శిక్షాస్మృతి (IPC) సెక్షన్లు 499, 500 (పరువు నష్టంతో వ్యవహరించడం) కింద దాఖలు చేసిన కేసులో రాహుల్ కోర్టుకు కూడా పలుమార్లు హాజరయ్యారు . 2021 అక్టోబర్లో తన వాంగ్మూలాన్ని ఇచ్చారు.
మోదీ ఇంటిపేరు ఉన్న వారందర్నీ రాహుల్ కించపర్చలేదని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే స్పష్టం చేసింది. మోదీ ఇంటి పేర్లు ఉండి పరారీలో ఉన్న నిరవ్ మోదీ, లలిత్ మోదీల గురించే ప్రస్తావించారని… ప్రధాని మోదీపై రాజకీయ విమర్శలు చేశారని చెబుతున్నారు. అయితే కోర్టు మాత్రం అలా అనుకోలేదు. రెండేళ్ల జైలు శిక్ష విధించింది. మొత్తానికి రాజకీయ నాయకులు ఘోరంగా విమర్శించుకుంటూ ఉంటారు. ఈ మాటలకే రెండేళ్ల జైలు శిక్ష వేస్తే.. ఇక తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకులందరికీ శిక్షలు పడాల్సిందేనని సెటైర్లు వినిపిస్తున్నాయి.