మామూలుగా అయితే అన్ని ఏకగ్రీవం కావాల్సిన ఎమ్మెల్సీ సీట్లు. కానీ టీడీపీ , జనసేన నుంచి వచ్చి చేరిన ఐదుగుర్ని చూసుకుని ఆశపడిన వైసీపీకి తమ ఎమ్మెల్యేలతో ఓట్లు వేయించుకోవడానికి పడిన తంటాలు అన్నీ ఇన్నీ కాదు. చివరికి ఓ ఎమ్మెల్యే కోసం స్పెషల్ ఫ్లైట్ ను కూడా ఏర్పాటు చేశారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల వైసీపీ ఎ్మెల్యే అప్పల్నాయుడు కుమారుడి పెళ్లి ఉండటంతో ఆయన నెల్లిమర్లలోనే ఉన్నారు. ఉదయం పెళ్లి అయిపోగానే అమరావతి వచ్చి ఓటు వేయాల్సి ఉంది. ఆ సమయానికి ఫ్లైట్స్ లేవు. దీంతో వైసీపీ నాయకత్వం స్పెషల్ ఫ్లైట్ ను ఏర్పాటు చేసింది.
విశాఖ నుంచి విజయవాడకు స్పెషల్ ఫ్లైట్ లో వచ్చిన అప్పల్నాయుడు మధ్యాహ్నం రెండున్నర గంటల తర్వాత ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయనే చిట్ట చివరిగా ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే. అంతకు వైసీపీ, టీడీపీ సభ్యులందరూ వరుసగా ఓటు వేశారు. 174 మంది ఓటు వేశారు. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు కూడా ఓటు వేశారు. ఆత్మప్రబోధానుసానుసారం వేశానని… కోటంరెడ్డి చెప్పుకున్నారు. మిగతా వారు మీడియాతో మాట్లాడలేదు.
ఈ ఎన్నికల్లో ఒక్క ఓటుతో ఫలితం తారుమారయ్యే అవకాశం ఉండటంతో వైసీపీ చాలా టెన్షన్ పడింది. అభ్యర్థులందర్నీ కనిపెట్టుకుని రెండు రోజుల పాటు ఓటు ఎలా వేయాలో ప్రాక్టీస్ చేయించింది. స్టార్ హోటళ్లలో క్యాంపులు ఏర్పాటు చేసింది. అసంతృప్త ఎమ్మెల్యేల కోరికలు తీర్చింది. చివరికి స్పెషల్ ఫ్లైట్ కూడా ఏర్పాటు చేసింది. మొత్తానికి అన్ని ఓట్లు పోలయ్యాయి. ఎవరి ఓట్లు వారికి వస్తాయా లేదా అన్నది ఐదు గంటల తర్వాత తేలనుంది.