వరుసగా తగులుతున్న షాక్‌లు.. నాలుగేళ్లుగా అధికారంలో ఉండి చంద్రబాబుపై తాము చేసిన ఆరు లక్షల కోట్ల అవినీతి ఆరోపణల్లో ఒక్క రూపాయి అవినీతిని బయట పెట్టలేకపోతున్న అసహనం మొత్తం కలిపి.. తాము ఏం చెప్పినా నడిచిపోతుందనుకునే అసెంబ్లీలో ఇష్టారీతిన ఆరోపణలు చేస్తూ సమయం గడిపేస్తున్నారు అధికార పార్టీ నేతలు. స్కిల్ స్కామ్ పేరుతో రెండు రోజుల క్రితం.. చెప్పిందే చెప్పి.. అసలు చంద్రబాబుకు ఒక్క రూపాయి చేరిందన్న విషయాన్ని నిరూపించలేకపోయిన ప్రభుత్వం .. చివరి రోజు మరోసారి అదే విన్యాసం చేసింది.
ఎప్పుడో 2019లో జరిగిన చంద్రబాబు పీఏ శ్రీనివాస్ ఇంటిపై జరిగిన ఐటీ దాడుల గురించి అప్పట్లో సాక్షి పత్రికలో రాసిన కథలన్నీ గుడివాడ అమర్నాథ్ అసెంబ్లీలో వినిపించారు. ఆయన చెప్పినవీ మరీ ఎఫెక్టివ్ గా అనిపించలేదేమో కానీ మళ్లీ జగన్ కూడా అదే చెప్పారు. ఇంతా చెప్పి చంద్రబాబుకు ఇంత మొత్తంలో చేరాయని ఆరోపించారు కానీ ఎలా చేరాయి.. ఏ ఖాతాలకు చేరాయన్నది చెప్పలేకపోయారు. దుబాయ్‌లో చంద్రబాబుకు డబ్బులిచ్చినట్లుగా తెలుస్తోందని చెప్పుకొచ్చారు. అమరావతిలో భవనాలను నిర్మించిన షాపూర్జీపల్లోంజి సంస్థ, ఎల్ అండ్ టీ దగ్గర డబ్బులు వసూలు చేసినట్లుగా సీఎం జగన్ చెప్పుకొచ్చారు.
ఆ రెండు దశాబ్దాలుగా నిర్మాణ రంగంలో ఉన్న దేశంలోనే అత్యంత ప్రముఖ కంపెనీలు. వాటిపైనే అసెంబ్లీ సాక్షిగా ఆధారాల్లేకుండా నిందలేశారు సీఎం జగన్. ఐటీ శాఖ దాడులు జరిపింది 2019లో ఇప్పటికి నాలుగేళ్లయింది. అయినా ఇప్పుడు చంద్రబాబు ఎమ్మెల్సీ సీట్లు గెలిచారు కాబట్టి ఆయనపై ఏదో ఒక మరక వేయాలని.. అప్పటికి తెచ్చి చూపించేశారు. దీనికి ఆధారాలేమీ ఉండవు. వారు అసెంబ్లీలో చెప్పారు అంతే. ఏమైనా ఉంటే విచారణ చేయించాలి.. డబ్బులు చేతులు మారినవి బయ టపెట్టాలి. అదేమీ లేకుండా అసెంబ్లీని ఇలా ఆరోపణలకు ఉపయోగించుకుంటున్నారని టీడీపీ నేతలు సహజంగానే ఆరోపిస్తూంటారు.