తెలంగాణా శాసనసభ బడ్జెట్ సమావేశాల మొదటిరోజున జరిగే గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకొన్న ఎమ్మెల్యేలని సభ నుండి ఏడాదిపాటు సస్పెండ్ చేయాలని శాసనసభ రూల్స్ కమిటీ తీసుకొన్న నిర్ణయాన్ని సి.పి.ఐ. సీనియర్ నేత నారాయణ తప్పు పట్టారు. తెలంగాణా ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ నేతలను, ప్రజా ప్రతినిధులను ఫిరాయింపులకి ప్రోత్సహిస్తూ చట్టాలను ఉల్లంఘిస్తుంటే, కిమ్మనకుండా చూస్తూ కూర్చొన్న గవర్నర్, స్పీకర్ ఏవిధంగా గౌరవానికి అర్హులవుతారు? అని ప్రశ్నించారు. వారిద్దరూ ప్రభుత్వానికి ‘రబ్బర్ స్టాంపు’ల మాదిరిగా మారిపోయారని అన్నారు. ప్రభుత్వం ఏమి చేసిన దానిని ఆమోదించడం లేదా మౌనంగా చూస్తూ కూర్చోవడమే వారు చేస్తున్న పనని ఆయన విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజా ప్రతినిధులు సభలో నిరసనలు తెలపడం తప్పు కాదు. అది వారి హక్కు కూడా. వారి ఆ హక్కును కూడా కాలరాసే అధికారం తెరాస ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారు? ఏ అధికారంతో ప్రజా ప్రతినిధులను ఏడాది పాటు సస్పెండ్ చేయాలనుకొంటోందని నారాయణ ప్రశ్నించారు.