నలుగురు ఎమ్మెల్యేలు ధిక్కరించారని వారిపై ఒక్క రోజులోనే సస్పెన్షన్ వేటు వేసిన వైసీపీ హైకమాండ్ రఘురామ విషయంలో మాత్రం ఏమీ తెలియనట్లుగా ఉంది. ఈ నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి విధేయులు. గౌరవం ఇవ్వలేదని వారు ధిక్కరించారు. రఘురామ కూడా అంతే. అయితే ఈ నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికీ పొలైట్ గానే ఉంటున్నారు. కానీ రఘురామకృష్ణరాజు మాత్రం అసలు వదిలి పెట్టడం లేదు. ప్రతీ రోజూ చాకిరేవు పెడుతున్నారు. సెటైర్లు వేస్తున్నారు. జగన్ను కామెడీ చేస్తున్నారు. ఆయన చేసే విమర్శలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఇంత జరుగుతున్నా ఆయనపై సస్పెన్షన్ వేటు మాత్రం వేయలేకపోతున్నారు. గతంలో ఆయనపై అనర్హతా వేటు వేయించేస్తామని తెగ హడావుడిపడిపోయారు. ప్రత్యేక విమానాల్లో ఢిల్లీకి వెళ్లారు. కానీ ఏమీ చేయలేకపోయారు. కనీసం విచారణ కూడా చేయించలేకపోయారు. తరవాత సాధ్యం కాదని సైలెంట్ అయిపోయారు. కనీసం పార్టీ నుంచి పంపేసి భారం దించేసుకుంటారని అనుకుంటే ఇంకా భరిస్తూనే ఉన్నారు. నలుగురు ఎమ్మెల్యేల్ని సస్పెండ్ చేయడంతో ఇప్పుడు రఘురామ అంశం కూడా తెరపైకి వచ్చింది.
ఇప్పుడు నలుగురు ఎమ్మెల్యేల్ని సస్పెండ్ చేసినందున వారు వేరే పార్టీలో చేరితే సమస్య ఉండదు. అనర్హతా వేటు వేయరు. కానీ ఆ నలుగురు టీడీపీతో మాట్లాడుకున్నారో లేదో స్పష్టత లేదు. ఒక్క కోటంరెడ్డి మినహా మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీతో టచ్లో ఉన్నారన్న విషయం స్పష్టత లేదు. కానీ రఘురామ మాత్రం ఖచ్చితంగా సస్పెండ్ చేస్తే వేరే పార్టీలో చేరిపోతారని వైసీపీ హైకమాండ్ అనుమానపడుతోంది. అందుకే అవమానాలు భరిస్తోంది కానీ సస్పెండ్ చేయడం లేదని భావిస్తున్నారు.