ఓ పరువు నష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్ష వేయడమే కాదు.. ఏకంగా ఎంపీ పదవిపై అనర్హతా వేటు వేయడాన్ని ఎవరూ ఊహించలేకపోతున్నారు. రాజకీయాల్లో అత్యంత దుర్మార్గులు సేఫ్ గా ఉన్నారు. కానీ దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన కుటుంబం నుంచి రాజకీయాలు చేస్తున్న వారు మాత్రం అనర్హతా వేటుకు గురయ్యారు. అది రాజకీయ విమర్శల కేసు. సాధారణంగా ఇలాంటివి రాజకీయాల్లో ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. రాజకీయ నాయకుడు మాట్లాడిన ప్రతి మాటకు పెడార్థాలు తీసుకుని తమ మనోభావాలు దెబ్బతిన్నాయని కోర్టులకు వెళ్లడమో.. కేసులు పెట్టడమే చేస్తూంటారు. కానీ ఇవన్నీ పొలిటికల్ స్టంట్స్ మాత్రమే.
దేశంలో రాజకీయ నేతలు చేసిన నిజమైన నేరాలకు శిక్షలు పడటం అరుదు. రాజకీయం అన్న తర్వాత నేతలు అనేక మాటలు అనుకుంటూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లో అయితే బూతులు తిట్టుకుంటూ ఉంటారు. అసందర్భ ఆరోపణలు చేసుకుంటూ ఉంటారు. ఏం జరిగినా ప్రత్యర్థులకు అంటించడమే రాజకీయం అనేలా మారిపోయింది. నిజానికి పరువు నష్టం కేసుల్లో ఇంత కఠినమైన శిక్షలు వేస్తారని ఎవరూ అనుకోరు. రాహుల్ గాంధీపై విధించిన శిక్ష మాత్రం దేశ రాజకీయ పరిస్థితులపై భిన్నమైన వాతావరణాన్ని కల్పించింది ఈ మాటలకే రెండేళ్ల జైలు శిక్ష వేస్తే.. రాజకీయ నాయకులందరికీ శిక్షలు పడాల్సిందేనని సెటైర్లు వినిపిస్తున్నాయి.
బీజేపీయేతర పార్టీలు, నేతలు ఉండకూడదన్న కుట్రలో భాగమేనని విపక్ష పార్టీలు అనుమానిస్తున్నాయి. సాధారణంలో ప్రధాని పదవికి పోటీలో ఉన్న వ్యక్తిగా రాహుల్ గాంధీని దేశ ప్రజలు చూస్తారు. ఆయనను ఓ చిన్న కారణంతో అసలు పోటీ లేకుండా ఎలిమినేట్ చేస్తారని ఎవరూ ఊహించి ఉండరు. ఇప్పటి వరకూ మన ప్రజాస్వామ్యంలో అలా జరగలేదు. ఒక వేళ రాహుల్ గాంధీపై అనర్హతా వేటు విషయంలో పాలకులదే పైచేయి అయితే.. ఇక విపక్ష నేతలెవరికీ గ్యారంటీ ఉండదు. నియంతృత్వంలోకి జారిపోయినట్లే.