సాంకేతికంగా జనసేనకు ఉన్న ఒకే ఒక్క ఎమ్మెల్యే తన మాటలతో తన పరువు తీసుకుంటున్నారు. తనకు టీడీపీ పదికోట్ల ఆఫర్ ఇచ్చిందని.. తర్వాత ఇవ్వలేదని… ఓటు వేసి ఉంటే ఇచ్చే వారని ఇలా రకరకాలుగా చెప్పుకున్న రాపాక.. ఒక్క రోజు తిరిగే సరికి తనది దొంగ ఓట్ల గెలుపని తేల్చేశారు. గత ఎన్నికల్లో ఆయన 814 ఓట్ల తేడాతో గెలిచారు. ఈ మెజార్టీ అంతా తన స్వగ్రామంతో పాటు ఇతర చోట్ల వేయించిన దొంగ ఓట్ల వల్లే వచ్చిందని చెబుతున్నారు. ఇలా ఆయన నేరుగా చెప్పుకుంటున్న వీడియో వైరల్ అవుతోంది. గత ఎన్నికల్లో ఆయన జనసేన తరపున పోటీ చేశారు. జనసేనకే దొంగ ఓట్లు వేయించారన్నమాట.
రాపాక వరప్రసాద్ మొదటి నుంచి ఇలాగే కామెడీ అవుతున్నారు. జనసేన నుంచి గెలిచి వైసీపీలో చేరి జగన్ భజన చేయడమే కాకుండా పవన్ ను కించ పరిచేలా మాట్లాడేవారు. వైసీపీలో కష్టపడితే… డబ్బుల్లేవని జగన్ టిక్కెట్ ఇవ్వలేదు. కానీ పవన్ ఇచ్చారు. అయినా కృతజ్ఞత చూపకుండా వైసీపీకి మారి పవన్ పైనే కామెంట్లు చేయడం కాకుండా ఇప్పుడు తానేదో నీతి మంతుడ్ననని.. టీడీపీ తనకు ఆఫర్ ఇచ్చిందని చెప్పుకురావడం ప్రారంభించారు. అది ఇంకా తేలక ముందే తాను దొంగ ఓట్లతో గెలిచాన ని గొప్పలు పోతున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ఇలాగే గెలవడానికి ఆయనేమైనా ప్రణాళికలు వేశారో లేదో తెలియదు కానీ… గత ఎన్నికల్లో ఏం చేశారో మాత్రం చెప్పుకొచ్చారు.
రాపాక అధికార పార్టీకి ఫిరాయించిన రాజోలుకు చేసిందేమీ లేదు. కానీ ఆయన పేకాటలో మాత్రం అన్ని పార్టీల నేతలతో కలిసి చాంపియన్ షిప్‌లు ఆడుతూంటారు. ఆ మధ్య ఇలా కొన్ని ఆడియోలు వైరల్ అయ్యాయి. టీడీపీనేత గొల్లపల్లి సూర్యారావు తో ఆయన పేకాట చాలెంజ్‌లు కలకలం రేపాయి. వచ్చే ఎన్నికల్లో జగన్ టిక్కెట్ ఇస్తారో లేదో కానీ గత రెండు ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన బొంతు రాజేశ్వరరావు మాత్రం జనసేనలో చేరిపోయారు