ఏపీ రాజకీయాలు చిత్ర విచిత్రంగా సాగుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరాజయం పాలై…. ధిక్కరించిన ఎమ్మెల్యేలంటూ కొంతమంది పై వేటేసిన తర్వాత ఇతర పార్టీల నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు తమకు కూడా ఆఫర్లు వచ్చాయంటూ తెర మీదకు వస్తున్నారు. వైసీపీలోకి ఫిరాయించిన జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అలా చేసిన తర్వాత తాజాగా గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే కూడా అలాంటి ఆరోపణలు చేస్తున్నారు. ఏవో నాలుగు ఫోన్ నెంబర్లు చూపించి తనకు ఆ ఫోన్ నెంబర్ల నుంచి ఆఫర్లు వచ్చాయని చెప్పుకొస్తున్నారు.
నిజానికి సాంకేతికంగా మద్దాల గిరి టీడీపీ బీఫాం మీద గెలిచిన వ్యక్తి. అసెంబ్లీ రికార్డుల్లో ఆయన టీడీపీ సభ్యుడిగానే ఉన్నారు. ఆయనను టీడీపీ సస్పెండ్ చేయలేదు. వైసీపీలో అధికారికంగా చేరలేదు. అయినా తనకు డబ్బులు ఆఫర్ చేశారని ఆయన ఎలా చెబుతున్నారో కానీ.. అది ఆయనకే మచ్చ అనే విషయం గుర్తించలేకపోతున్నారు. పైగా పోలింగ్ కు వారం ముందే తనకు ఆఫర్ వచ్చిందని చెప్పుకొచ్చి.. పోలింగ్ అయిపోయిన ఐదు రోజుల తర్వాత ఎందుకు స్పందిస్తున్నారో కానీ.. అసలు టీడీపీ ఎమ్మెల్యే అయి ఉండి.. వైసీపీకి ఎందుకు ఓటేశారనే ప్రశ్న ఇప్పుడు ఆయనకు ఎదురవుతోంది.
టీడీపీ నుంచి గెలిచిన వైసీపీలోకి ఫిరాయించిన మద్దాలి గిరి ప్రభుత్వం నుంచి తన మిల్లులకు రావాల్సిన సబ్సిడీలను రాబట్టుకున్నారు. తర్వాత నియోజకవర్గానికి ఏమైనా పనులు చేశారా అంటే అదీ లేదు. నివాసం ఉన్న సొంత వార్డులో కార్పొరేటర్‌ను గెలిపించుకోలేకపోయారు. వచ్చే ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నుంచి అప్పిరెడ్డి పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇలాంటి ఆరోపణలు చేస్తే గుంటూరు టిక్కెట్ ఖరారు చేస్తారన్న ఉద్దేశంతో ఆయనీ పనులు చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.