వైఎస్ఆర్సీపీలో ఆల్ ఈజ్ నాట్ వెల్ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఆ పార్టీలో నెలకొన్న అసంతృప్తి ఒక్క సారిగా భగ్గుమనే పరిస్థితి కనిపిస్తోంది. ఈ వాతావరణం పార్టీ కేంద్ర కార్యాలయంలోనూ కనిపిస్తోంది. అనుమానాలు పెంచుకుని కొందరిపై ప్రత్యేక నిఘా పెట్టడంతో ఇది మరింత పెరిగిపోయింది. పార్టీ కేంద్ కార్యాలయంలో ప్రెస్ మీట్లకు అందరికీ అనుమతి ఇవ్వడం లేదు. సజ్జల అనుమతి ఉంటే తప్ప కార్యాలయంలోకి ఎవర్నీ అడుగు పెట్టనీయడం లేదని చెబుతున్నారు.
ఓ వైపు నిఘాతో పాటు మరో వైపు అసలు పార్టీ కోసం తొమ్మిదేళ్లు కష్టపడితే అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో అంతకు మించిన అవమానాలు చూపించారంటూ వాపోతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ఇందులో సీనియర్లు కూడా ఉన్నారు. చాలా కాలంగా వారు పార్టీతో అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారు. వీరంతా ఇతర పార్టీలతో టచ్లో ఉన్నారని వైసీపీ హైకమాండ్ అనుమానిస్తోంది కానీ.. వారి అసంతృప్తి గుర్తించడానికి మాత్రం సిద్ధంగా లేదు.
ఇక్కడిదాకా వచ్చినా పరిస్థితులు మారకపోగా తమపై మరింత అనుమానం పెంచుకుని అవమానిస్తున్నారన్న కోపం చాలా మంది సీనియర్ నేతల్లో ప్రారంభమయింది. ఈ అసంతృప్తి ఎప్పుడైనా బద్దలవ్వొచ్చన్న ప్రచారం…. వైసీపీలో వినిపిస్తోంది. గతంలోలా చాలా మంది నేతలు బయటకు వచ్చి పార్టీ కోసం డిఫెండ్ చేస్తున్నట్లుగా మాట్లాడటం లేదు . బూతులు మాట్లాడటానికి వెనుకాడుతున్నారు. బరితెగించిన కొంత మంది మాత్రమే ముందుకు వస్తున్నారు.
వైసీపీలో వ్యూహాలన్నీ ఇప్పుడు రివర్స్ లో అవుతున్నాయి. వైసీపీ ఏం చెప్పినా ప్రజల్లోకి వెళ్లడం లేదు . ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి ఉందన్న భావన అంతటా వ్యాపించింది. ఇది కూడా పార్టీలో అసంతృప్తి సునామీ ఎగసిపడే అవకాశాలకు మరో సూచనగా చెబుతున్నారు. మొత్తంగా వైసీపీ ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కుంటోందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.