ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్. ఏపీ ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వ విధానం అమలు చేయాలంటే… ఏపీ అని ప్రారంభిస్తుంది. అంటే ఏపీ భవన నిర్మాణ విధానం, ఏపీ పారిశ్రామిక విధానం, ఏపీ అప్పుల పాలసీ, ఏపీ నిధుల పాలసీ అని పెట్టుకుంటారు. కానీ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన పారిశ్రామిక అనుమతుల విధానానికి… వైఎస్ఆర్ ఏపీ వన్ అని పేరు పెట్టారు. దీంతో ఏపీని వైఎస్ఆర్ ఏపీ అని మార్చేశారా ఏమిటి అని ఆశ్చర్యపోవడం ప్రజల వంతు అవుతోంది.
ఏదైనా కట్టండి .. దానికి పేర్లు పెట్టుకోండి మహా ప్రభో అని ఆంధ్రజనం మెత్తుకుంటున్నా ఏపీ ప్రభుత్వం మాత్రం సర్టిఫికెట్ల మీద పేర్లు ఫోటోలు వేసుకోవడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే ఆస్పత్రుల్లో చీటీల మీద కూడా జగన్ బొమ్మ పెట్టేసుకుంటున్నారన్న సెటైర్లు వినిపిస్తూంటే… తాజాగా పరిశ్రమలకు అనుమతు ఇచ్చేందుకు తీసుకొచ్చిన విధానానికి వైఎస్ఆర్ పేరు పెట్టేశారు. వైఎస్ఆర్ ఏపీ వన్ పేరుతో యాప్, పోర్టల్ తెచ్చి అనుమతులు కావాల్సిన వారందరూ అందులో దరఖాస్తు చేసుకోవాలని సలహా ఇస్తున్నారు. ఇది ప్రభుత్వ పోర్టల్. దీనికి వైఎస్ఆర్ పేరేమిటా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.
పేర్లు, రంగుల పిచ్చి ఈ ప్రభుత్వ పెద్దలకు మొదటి నుంచి ఉంది. అది అంతకంతకూ పెరిగిపోతోంది. ఇక పెట్టుకోవడానికి ఎక్కడా సందు లేదని పారిశ్రామిక విధానానికీ పేరు పెట్టేశారు. తెలంగాణ ప్రభుత్వం కూడా పరిశ్రమలకు అనుమతులు ఇచ్చేందుకు ప్రత్యేక విధానం తెచ్చింది. భవనాలకు అనుమతులు ఇచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇదంతా పాలనలో ఓ భాగం. అయితే వాటికి కేసీఆర్, కేటీఆర్ తమ పేర్లు పెట్టుకోలేదు. తెలంగాణ అనే పెట్టుకున్నారు. కానీ ఏపీలో మాత్రం…. వైఎస్ఆర్ ఏపీ అని పేరు పెట్టారు. అంటే ఏపీ పేరును వైఎస్ఆర్ ఏపీగా ప్రచారంలోకి తెచ్చేందుకు ఈ పని చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి