పులివెందులలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. మార్కెట్ సెంటర్లో ఒక్క సారిగా కాల్పుల శబ్దం వినిపించడంతో జనం ఉలిక్కి పడ్డారు. ఈ కాల్పుల్లో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ కాల్పులు జరిపిన వ్యక్తిని భరత్ కుమార్ యాదవ్ గా గుర్తించారు. దిలీప్ అనే వ్యక్తితో ఉన్న ఆర్థిక వ్యవహారాల్లో తేడాలు రావడంతో భరత్ కుమార్ యాదవ్ కాల్పులు జరిపినట్లుగా చెహుతున్నారు.
భరత్ కుమార్ యాదవ్ పేరు వైఎస్ వివేకా హత్య కేసులో కూడా వినిపించింది. సీబీఐ ఆయనను ప్రశ్నించింది. వివేకానందరెడ్డి హత్య ఘటనకు వివాహేతర సంబంధాలు, సెటిల్మెంట్లే కారణమని తరచూ మీడియా మందుకు వచ్చి చెబుతూ ఉంటారు. ఈయనకు ప్రో వైసీపీ మీడియా మంచి కవరేజీ ఇస్తూ ఆరోపణలు ప్రచురిస్తూ ఉంటుంది. సీబీఐ పై కూడా భరత్ కుమార్ యాదవ్ ఆరోపణలు చేశారు. సునీత భర్త రాజశేఖర్ రెడ్డి నుంచి ప్రాణహానీ ఉందని మీడియా సమావేశాల్లో చెబుతూ ఉంటారు.
గత ఏడాది ఫిబ్రవరిలో అప్రూవర్‌గా మారిన దస్తగిరి తనను భరత్ యాదవ్ భయపెడుతున్నారని, ప్రలోభ పెడుతున్నారని సీబీఐకి కూడా ఫిర్యాదు చేశారు. భరత్ యాదవ్ తన ఇంటికి వస్తన్నారని అవినాష్ రెడ్డిని కలవాలంటున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. అయితే భరత్ యాదవ్ అప్పట్లో రివర్స్ ఆరోపణలు చేశారు. దస్తగిరి ని సీబీఐ వాళ్ళు ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. తనకు రావాల్సిన డబ్బులు దస్తగిరి ని అడిగానని … కావాలనే దస్తగిరి డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు.
ఓ ఊరూపేరూ లేని పత్రికకు జర్నలిస్టుగా చెప్పుకునే భరత్ యాదవ్.. వైసీపీ తరచూ చెప్పే… వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డినే హత్యకు కుట్రధారులనే స్టోరీని తరచూ వినిపిస్తూ ఉంటారు. ఇప్పుడు జరిపిన కాల్పుల్లో కూడా.. వివేకా హత్య కేసుకు సంబంధించిన వ్యవహారాల్లో అర్థిక అంశాలపై తేడా రావడం వల్ల జరిగాయా.. లేక మరొకటా అన్నది స్పష్టత రావాల్సి ఉంది. కానీ ఏపీ పోలీసులు ఈ కేసును వీలైనంత సాధారణంగా చేస్తారని ఎక్కువ మంది నమ్ముతున్నారు.