హైదరాబాద్ కంటే అమరావతి పెద్దది. హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడానికి ఏర్పాటు చేసిన హెచ్ఎండీఏ కంటే… ఏపీ కొత్త రాజధాని సీఆర్డీఏ విస్తీర్ణం చాలా పెద్దది. ఈ విషయాన్ని స్వయంగా చెప్పింది తెలంగాణ మంత్రి కేటీఆర్. ఇలా చెప్పడానికి కారణం అమరావతిని ప్రమోట్ చేయడం కాదు. అక్కడ ఏమీ జరగడం లేదని.. భవిష్యత్ అంతా హైదరాబాదేనని పరోక్షంగా చెప్పడం. హైదరాబాద్‌లో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కార్పొరేట్ సంస్థల విరాళాలతో హైదరాబాద్ సుందరీకరణ పనులను కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు.
హైదరాబాద్ పట్టణం గురించి .. హైదరాబాద్‌కు ఉన్న అనుకూలతల గురించి ప్రసంగించారు. ఈ సందర్భంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెలవప్మెంట్ అధారిటీ విస్తీర్ణం గురించి ప్రస్తావించారు. దేశంలోనే హెచ్ఎండీఏ అతి పెద్దదన్నారు. ఈ సందర్భంలోనే అమరావతిని గుర్తు చేసుకున్నారు. హెచ్ఎండీఏ కంటే అమరావతి అతి పెద్దదన్నారు. అయితే ఇప్పుడు అక్కడ పనులేం జరగడం లేదన్నారు. అంటే… పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్న అర్థంలో మాట్లాడారు. కేటీఆర్ మాట్లాడిన ఈ మాటలు వైరల్ అవుతున్నాయి.
ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి రాజధాని లేకుండా పోయింది. దీంతో అప్పటి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఖరారు చేసి సీఆర్డీఏను ఏర్పాటు చేసింది. 2014లో సీఆర్డీఏ చట్టాన్ని ముందుకు తెచ్చింది. కృష్ణాజిల్లా నందిగామ మొదలు, గుంటూరు జిల్లా చిలకలూరిపేట వరకు సీఆర్డీఏ విస్తరించింది. కోర్ క్యాపిటల్ నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం ఎన్నో ప్రణాళికలు వేసింది. దాదాపుగా రూ. యాభై వేల కోట్ల విలువైన పనులు రాజధానిలో జరిగేవి. అయితే ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడంతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ అమరావతి నిర్మాణ పనుల్ని పూర్తిగా నిలిపివేశారు. దీంతో హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ ఆకాశాన్ని తాకింది. ఏపీలో భూముల విలువలు పడిపోయాయి. ఏపీకి రాజధాని లేకుండా పోయింది.