ఏపీ సీఎం జగన్ రెడ్డి ఇక సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకూ ఆయన ఐ ప్యాక్, సజ్జల రామకృష్ణారెడ్డిపై పూర్తి స్థాయిలో ఆధారపడ్డారు. ప్రతి చిన్న విషయంపై వారి అభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ సహచరులు కూడా వారి సూచనలతోనే ఎంపికయ్యారు. కానీ ఇప్పుడు పాత టీం కన్నా కొత్త టీం ఏ మాత్రం ప్రభావవంతంగా లేకపోవడంతో చివరికి సొంత నిర్ణయాలతో మార్పు చేర్పులు చేసుకుని ముందస్తుకు వెళ్లాలనే ఆలోచనలో పడ్డట్లుగా చెబుతున్నారు. అందుకే ఆయన తరచూ ఢిల్లీ పర్యటనకు వెళ్తారని అంటున్నారు.
సామాజిక సమీకరణాల పేరుతో పార్టీలో చిచ్చు పెట్టుకున్నానని జగన్ ఇప్పటికే గుర్తించారు. కొడాలి నాని, పేర్ని నాని వంటి విశ్వాసపాత్రుల్ని.. దూకుడుగా ఉండే వారిని కేబినెట్ నుంచి తప్పించి పెద్దగా నోరు తెరవని వారికి పదవులిచ్చామనే అభిప్రాయం జగన్ లో ఉంది. అలాగే తన కోసం నిలబడిన సీనియర్లకు పదవులివ్వడంలోనూ తప్పు జరగడంతో ఇప్పుడు దిద్దుకోవాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. కొడాలి నాని, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిలతో పాటు మరికొంత మంది విధేయులకు మంత్రి పదవులు ఇవ్వాలనుకుంటున్నట్లుగా చెబుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో తమకు ఓట్లు వేయరన్న ఉద్దేశంతో వైశ్య, బ్రాహ్మణ, కమ్మ, క్షత్రియ సహా పలు వర్గాలకు వారి మంత్రి పదవుల్ని తొలగించారు. ఇలా చేయడం వల్ల వారిని పూర్తిగా దూరం చేసుకున్నట్లయిందని… ఇతర వర్గాలు వంద శాతం మద్దతు పలికే పరిస్థితి లేదని అంచనాకు వచ్చారు. ఇదంతా వ్యూహాత్మక లోపమేనని అనుకుంటున్న జగన్.. ఈ తప్పుల్ని దిద్దుకుని ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచన చేస్తున్నట్లుగా వైసీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి .
సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో బీజేపీతో సంబంధాలు బలోపేతం చేసుకోవడం… రాజకీయంగా వీలైనంత సహకారం పొందడం లక్ష్యంగా మంతనాలు జరుపుతున్నారని భావిస్తున్నారు. జగన్ ముందస్తు ఎన్నికలపై చాలా క్లారిటీతో ఉన్నారని తెలంగాణతో పాటే ఎన్నికలు జరిగేలా చూడాలని ఆయన కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కోరుతున్నట్లుగా చెబుతున్నారు. మొత్తంగా ఇప్పుడు జగన్ సొంత రాజకీయం ప్రారంభించారన్న నమ్మకం మాత్రం వైసీపీ వర్గాల్లో వినిపిస్తోంది.