టీఎస్పీఎస్సీ వ్యవహారంలో తన పేరును పదే పదే ప్రస్తావిస్తున్న అంశంపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం చెందుతున్నారు. చివరికి పరువు నష్టం కేసు కూడాదాఖలు చేశారు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లకు పరువునష్టం దావా నోటీసులు ఇచ్చారు. రాజకీయ దురుద్దేశంతోనే తన పేరును అనవసరంగా లాగుతున్నారని.. తన న్యాయవాది ద్వారా ఆ ఇద్దరికి లీగల్ నోటీసులు పంపించారు. ఇండియన్ పీనల్ కోడ్‌లోని 499, 500 నిబంధనల ప్రకారం పరువునష్టం దావా నోటీసులు పంపారు.
సుదీర్ఘకాలం పాటు ప్రజా జీవితంలో ఉన్న తన పరువుకు భంగం కలిగించాలన్న దురుద్దేశంతోనే.. బండి సంజయ్, రేవంత్ రెడ్డిలు పదేపదే అబద్ధాలు మాట్లాడుతున్నారని అన్నారు. ప్రజాప్రతినిధిగా ఉన్నంత మాత్రాన.. ఎదుటి వారిపై అసత్య ప్రేలాపనాలు చేసే హక్కు వారికి లేదని కేటీఆర్ పేర్కొన్నారు. ఎలాంటి ఆధారాలు లేని సత్య దూరమైన ఆరోపణలను మానుకోవాలని సూచించారు. ఇప్పటివరకూ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని.. తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆ నోటీసులో కేటీఆర్ డిమాండ్ చేశారు. వారం రోజుల్లోగా తమ వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకొని క్షమాపణలు చెప్పకపోతే.. రూ.100 కోట్ల పరువునష్టం దావాను ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు.
ఈ సందర్భంగా.. బండి సంజయ్, రేవంత్ రెడ్డిలు చేసిన నిరాధార ఆరోపణలను సాక్షాలతో సహా తన నోటీసులో ప్రస్తావించారు. అయితే ఇలాంటి నోటీసులను బండి సంజయ్, రేవంత్ మరింత రాజకీయానికి వాడుకునే అవకాశం ఉంది. కేటీఆర్ పేరును లీకేజీ వ్యవహారంలో మరింత ఎక్కువగా ప్రచారం లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తారు. నిజానికి రేవంత్, బండి సంజయ్ చేసే ఆరోపణలు రాజకీయమేనని .. అందులో నిజం ఉందని ఎక్కువ మంది నమ్మరు. అయినా కేటీఆర్ మాత్రం చాలా సీరియస్ గా తీసుకుని న్యాయపోరాటానికి కూడారెడీ అయ్యారు. ఫలితంగా ఆయనకుతెలియకుండానే ఆయన పేరు ఎక్కువగా ప్రచారంలోకి వస్తోంది.