ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్నప్పటి నుండి అమిత్ షా నుంచి పిలుపు వస్తుందేమోనని ఎదురు చూశారు. చివరికి రాత్రి పదకొండు గంటలకు ఆయనకు పిలుపువచ్చింది. పదకొండున్నర దాటే వరకూ అమిత్ షా నివాసంలో గడిపారు. అరగంట పాటు చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. ఎప్పట్లాగే భేటీ అయిన తర్వాత ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. అందులో పాత విషయాలే ఉన్నాయి. ఎప్పుడూ ఇచ్చే విజ్ఞాపనా పత్రం ఇవ్వడానికి జగన్ అర్థరాత్రి పూట ఎందుకు వెళ్లారనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.
పోలవరం నిధులు అమిత్ షా ఎలా ఇస్తారు ?
అమిత్ షా కేంద్ర హోంమంత్రి మాత్రమే. ఆయనకు పోలవరం నిధులతో సంబంధం ఉండదు. కానీ జగన్ అడిగినట్లుగా ప్రచారం చేసుకుటున్న వాటిలో అన్ని శాఖల విజ్ఞప్తులు ఉన్నాయి. ఇక్కడే అసలు అమిత్ షాతో భేటీకి జగన్మోహన్ రెడ్డి ఏజెండా వేరు ప్రజల్ని మభ్య పెట్టేందుకు చేస్తున్న ప్రచారం వేరని తేలిపోతుంది. అసలు హోంమంత్రితో అర్థరాత్రి సమావేశం కావాల్సిన అర్జంట్ మ్యాటర్ ఏమిటనేది ప్రజలకు తెలియకూడదా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సాధారణంగా అమిత్ షా .. అధికారిక సమావేశాలు రాత్రి సమయాల్లో నిర్వహించరు. పార్టీ పరమైన వ్యవహారాలకే సమయం కేటాయిస్తారని అంటున్నారు. రాజకీయాల కోసమే జగన్ అమిత్ షాను కలిసి ఉంటారని చెబుతున్నారు.
అవినాష్ రెడ్డి కేసా ? ముందస్తు ఎన్నికలా ?
వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ ెడ్డిని కాపాడటానికి సీఎం జగన్ చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. దర్యాప్తు అధికారులపై కేసులు పెట్టే పరిస్థితి కూడా వచ్చింది. చివరికి దర్యాప్తు అధికారిని మార్చాలని నిందితుడు పెట్టుకున్న పిటిషన్పై సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది. ఇలాంటి సమయంలో తదపురి వ్యూహాల అమలు కోసం అమిత్ షా సపోర్టును జగన్ కోరి ఉంటారన్న అభిప్రాయం వినిపిస్తోంది. అదే సమయంలో తెలంగాణతో పాటే ఏపీకి ఎన్నికలు జరిపించాలని ఇందు కోసం సహకరించాలని కోరినట్లుగా చెబుతున్నారు.
ప్రజలకు నిజాలు తెలుసుకునే హక్కు లేదా ?
ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా జగన్ ఏదో ఓ ప్రయోజనం సాధించుకుని వస్తారు. అయితే అది రాష్ట్రానికి కాదు. సొంతానికి. నాలుగేళ్లలో ఆయన ఢిల్లీ పర్యటనల వల్ల రాష్ట్రానికి సాధించింది ఏమీ లేదు. మామూలుగా రావాల్సిన వాటినీ సాధించలేకపోతున్నారు. అయితే ప్రకటనలకు.. ప్రచారానికి మాత్రం కొదువ ఉండటం లేదు. అసలు ఆయన ఢిల్లీ పర్యటనల ఎజెండా ఏమిటో మాత్రం జనాలకు తెలియనివ్వడం లేదు. ప్రజలిచ్చిన అధికారంతో పర్యటనలు చేస్తూ.. అసలు విషయాలు ప్రజలకే తెలియనివ్వడం లేదు.