సామాన్య ప్రజలు ఏదయినా కేసులో పోలీస్ స్టేషన్ కి వెళ్ళవలసివస్తే దానిని చాలా అవమానకరంగా భావిస్తారు. కానీ మన రాజకీయ నాయకులు, సినీ నటులు తీవ్ర నేరారోపణల కారణంగా జైళ్ళలో నెలలు, సంవత్సరాలు గడిపి వచ్చినా దానిని చాలా గొప్ప విషయంగానే భావిస్తారు. అలాగే వర్ణించుకొంటారు కూడా. ఈ రోజుల్లో ప్రజలు కూడా వారి ‘ఆ గొప్పదనాన్ని’ ఆమోదించి అక్కున చేర్చుకొంటున్నారు కనుక జైలుకి వెళ్లిరావడం ఇప్పుడు రాజకీయ నాయకులకి ‘అదనపు అర్హత’గా మారిపోయింది. జైలుకి వెళ్లి వచ్చిన వారి ఆ ‘అదనపు ప్రత్యేక అర్హత’ని సామాన్య ప్రజలే కాదు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు కూడా గుర్తిస్తున్నాయి. చాలా గౌరవిస్తున్నాయి. బహుశః అందుకేనేమో మన రాజకీయ నాయకులలో చాలా మంది ‘అవసరమయితే (అందుకోసం) తాము కూడా జైలుకి వెళ్ళడానికి కూడా సిద్దమేనని’ ఏదో ఒక సందర్భంలో అంటుంటారు.
ఇక విషయంలోకి వస్తే అక్రమాయుధాలు కలిగినందుకు జైలు శిక్ష అనుభవించిన బాలీవుడ్ నటుడు సంజయ్ దత్త్ ఇటీవల పరవాడ జైలు నుండి విడుదలయిన సంగతి అందరికీ తెలిసిందే. జైలుకి వెళ్లి వచ్చినందుకు అప్పుడే ఆయనకు ఆ ‘ప్రత్యేక గౌరవ మర్యాదలు’ మొదలయిపోయాయి. ఆయనను తమ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండమని ‘ది న్యూ డిల్లీ మునిసిపల్ కౌన్సిల్’ (ఎన్.ఎం.డి.సి.) కోరడం అందుకు ఆయన అంగీకరించడం జరిగిపోయాయి. డిల్లీలో ఎన్.ఎం.డి.సి. అమలు చేస్తున్న స్వచ్చ భారత్ మరియు స్మార్ట్ సిటీ పధకాలకు ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించబోతున్నారు. సంజయ్ దత్త్ పరవాడ జైలు నుండి విడుదలయిన రోజునే అంటే ఫిబ్రవరి 26నే ఎన్.ఎం.డి.సి. చైర్మన్ నరేష్ కుమార్ ఆయనకు లేఖ వ్రాయడం విశేషం.
ఆయన సంజయ్ దత్త్ కి వ్రాసిన లేఖలో “దేశంలో యువతకు ప్రతినిధిగా యువశక్తికి గొప్ప చిహ్నంగా ఉన్న మీరు మా ఎన్.ఎం.డి.సి. చేపడుతున్న స్వచ్చ భారత్ మరియు స్మార్ట్ సిటీ పధకాలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడానికి అంగీకరించినట్లయితే దాని వలన లక్షల మంది ఉన్న మీ అభిమానులకి, అలాగే డిల్లీ వాసులకు మంచి స్ఫూర్తి కలిగించినవారవుతారు. మీరు మా విన్నపాన్ని అంగీకరించి మా బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేయడానికి అంగీకరించినట్లయితే మా సంస్థ దానిని చాలా గౌరవంగా భావిస్తుంది. మీ సహకారం వలన మా సేవలకు అదనపు విలువను జోడించినట్లవుతుంది అంతే కాదు అంతర్జాతీయంగా మా సంస్థ ప్రతిష్ట పెరుగుతుంది,” అని వ్రాసారు.
ఎన్.ఎం.డి.సి. చైర్మన్ నరేష్ కుమార్ వ్రాసిన ఆ లేఖకు సంజయ్ దత్త్ సానుకూలంగా స్పందించి ఆయన ప్రతిపాదనను అంగీకరిస్తున్నట్లు తెలిపారు. సంజయ్ దత్త్ చేసిన నేరానికి జైలు శిక్ష అనుభవించి వచ్చేరు కనుక ఆయన తన ఇష్టప్రకారం జీవించవచ్చును. ఇటువంటి ఆఫర్లను అంగీకరించవచ్చును. అందులో తప్పేమీ లేదు. అయితే దేశం ప్రతిష్టను ఇనుమడింపజేసే వేలాదిమంది ప్రముఖులు దేశంలో ఉన్నప్పటికీ వారిని కాదని అక్రమాయుధాల కేసులో జైలుకి వెళ్లి వచ్చిన సంజయ్ దత్త్ వలననే ప్రజలకు స్ఫూర్తి కలుగుతుందని, ఆయన వలననే తమ సంస్థ ప్రతిష్ట ఇనుమడిస్తుందని ఎన్.ఎం.డి.సి. చైర్మన్ నరేష్ కుమార్ అనుకోవడమే కొంచెం విచిత్రంగా ఉంది.