వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ఉన్న కీలక నాయకుల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఒకరు. అయితే ఆయన కూడా పార్టీ రాజకీయాల పట్ల చాలా కాలంగా విముఖంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. ఆయన పార్టీ వీడుతారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఆయన తనయుడు పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి రాజంపేట ఎంపీగా ఉన్నారు. చచ్చేవరకు జగన్‌తోనే ఉంటానని ఆయన చెబుతున్నారు. జగన్‌కు అత్యంత విశ్వసనీయులైన నవతరం నాయకుల్లో ఒకరిగా మిధున్‌రెడ్డికి పేరుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పార్టీని వీడి పోతారా? సాధ్యమేనా? అంటే.. పోయినా ఆశ్చర్యం లేదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అందుకు గల కారణాలు కూడా తర్కబద్ధంగానే ఉన్నాయి.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లాల్లో కీలక కాంగ్రెస్ నాయకుల్లో ఒకరు. అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డిని ఖాతరు చేయకుండా ఎదిగిన నాయకుడు కూడా! వైఎస్ తాను పాదయాత్ర చేస్తుండగా, దానికి పోటీగా చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కూడా పాదయాత్ర చేసి.. వైఎస్ ఏంటి గొప్ప? అని అన్యాపదేశంగా నిలదీసిన నాయకుడు! కాంగ్రెసు పార్టీలో వారిద్దరివీ వేర్వేరు వర్గాలు. అయితే తదనంతర పరిణామాల్లో వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. పెద్దిరెడ్డికి మంత్రి ఇవ్వకుండా కూర్చోబెట్టారు.
అయితే చాలా కాలానికి జగన్‌తో వ్యాపారాల పరంగా సాన్నిహిత్యం కుదురుకున్నాక జగన్ ఒత్తిడితోనే.. తమ మధ్య వైరం ఉన్నప్పటికీ వైఎస్ఆర్.. పెద్దిరెడ్డికి మంత్రి పదవి ఇచ్చినట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. జగన్ మనిషిగానే ఆయన ఉన్నారు. ఆ తర్వాతి పరిణామాల్లో జగన్ పార్టీ పెట్టాక.. అందులో చేరి.. తన కొడుకును కూడా ఎంపీ చేయగలిగారు. అయితే ఇప్పుడు వైకాపా కష్టాల్లో ఉన్న సమయంలో పెద్దిరెడ్డి జగన్‌తోనే ఉండడం సాధ్యమా అనే సందేహాలు వస్తున్నాయి. మొన్న లోటస్‌పాండ్‌లో జగన్ నిర్వహించిన ఎమ్మెల్యే సమావేశానికి పెద్దిరెడ్డి డుమ్మా కొట్టారు. అలాగే ఆయనకు సన్నిహితుడైన మదనపల్లె ఎమ్మెల్యే కూడా డుమ్మా కొట్టాడు. వీరు జగన్ పార్టీనుంచి జారుకుంటారేమో అనే అనుమానాలు పెరుగుతున్నాయి.
ట్విస్టు ఏంటంటే.. పెద్దిరెడ్డికి సంబంధించినంత వరకు తెలుగుదేశంలోకి వెళ్లడానికి కూడా అవకాశం లేదు. చంద్రబాబుతో యూనివర్సిటీ లో రాజకీయాల కాలం నుంచి బద్ధశత్రుత్వం ఉంది. అటువైపు ఆయన వెళ్లలేరు. పెద్దిరెడ్డి మళ్లీ కాంగ్రెస్ రాజకీయాల్లోకి వెళ్లవచ్చునని.. వైకాపాతో అంటీ ముట్టనట్టుగా ఉంటూనే.. సరైన అవకాశం వచ్చి కాంగ్రెస్ కనీసం లేచి నిలబడగలదనే నమ్మకం కలిగితే అటువైపు వెళ్తారనే ఒక ప్రచారం ఉంది.
ఒకవైపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైకాపాను వీడుతారనే అనుమానాలు పుడుతుండగా.. ఆయన కొడుకు ఎంపీ మిధున్‌రెడ్డితో ‘చచ్చేవరకు జగన్ తోనే ఉంటా’ అంటూ ఒక ఇంటర్వ్యూ ఇటీవల ప్రచురితమైంది. అయితే ఇది ఆయన స్వబుద్ధితో చెప్పినదేనా.. లేదా, వెళ్లిపోదలచుకున్న వారితో ముందుజాగ్రత్తగా ఒట్టు పెట్టించుకున్నట్లుగా చేసిన బలవంతపు ఇంటర్వ్యూనా? అనేది కాలగమనంలో తేలుతుంది.