ఒకటో తేదీన బ్యాంకులకు సెలవు.. రెండో తేదీన ఆదివారం మూడో తేదీన అందరికీ పెన్షన్లు, జీతాలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వ పెద్దలు కనీసం ఒక్కరంటే ఒక్కరికి సామాజిక పెన్షన్లు ఇవ్వలేదు. ప్రభుత్వం వద్ద రెండున్నర వేలు కూడా లేనంత దీనస్థితి కనిపిస్తోంది. ఆర్బీఐకే ఇంకా బాకీ ఉన్నట్లుగా చెబుతున్నారు. కేంద్రం దయతలిచి రూ .మూడు వేల కోట్లను ఆర్బీఐ నుంచి అప్పుగా తీసుకునేందుకు అంగీకరించింది. అది మంగళవారం ప్రాసెస్ జరగుతుంది. బుధవారం చేతికి అందుతాయి. ఆ మూడు వేల కోట్లు.. ఆర్బీఐకి ఏ బాకీ లేకపోతే ప్రభుత్వ ఖాతాలోకి వస్తాయి .. వాటి నుంచి సామాజిక పెన్షన్లు.. జీతాలు.. రిటైరైన ఉద్యోగులకు పెన్షన్లు చెల్లించడం ప్రారంభిస్తారు. ఈ పెన్షన్లు, జీతాల కోసం కోసం ఎదురు చూస్తున్న వారంతా తీవ్రమైన టెన్షన్లో ఉంటే.. సీఎం జగన్ మాత్రం అద్భుతమైన మానసిక ఆనందాన్ని పొందుతున్నారు.
కక్ష సాధింపు కోసం సీఐడీని ప్రయోగించి రామోజీరావు, ఆయన కోడల్ని ప్రశ్నించి.. ఆ వీడియోలు, ఫోటోలను సీఐడీతో తీయించుకుని సాక్షి మీడియాలో ప్రసారం చేయించుకుని ఏ-1, ఏ-2 అని కసితీరా గ్రాఫిక్సులు వేయించుకుని వికృతానందం పొందుతున్నారు. అప్పనంగా ప్రజా ఆస్తులను సొంత వాటిలాగా కట్టబెట్టి .. కొట్టేసిన డబ్బుతో పెట్టుకున్న సాక్షి మీడియాలో… దశాబ్దాలుగా నమ్మకంతో నిలబడిన ఓ వ్యాపార సంస్థ… మీద దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారం పొందిన వ్యక్తి మీద దారుణమైన అధికార దుర్వినియోగానికి పాల్పడి వేధిస్తున్నారు. వాటిని చూసి ఆయన అమితానందం పొందుతున్నారు.
ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తే ప్రజలు దాన్ని లాగేసుకుంటారని.. తర్వాత తమకు అంత కంటే ఘోరమైన పరిస్థితులు కల్పిస్తారని మర్చిపోయి.. తాత్కాలిక ఆనందాల కోసం..ఇతరుల్ని.. ప్రత్యర్థుల్ని హింసించడానికి అధికారాన్ని దుర్వినియోగం చేయడంలో సీఎం జగన్ రాటుదేలిపోయారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఆయనపై ప్రజలు తిరుగుబాటు చేయడానికి ఎక్కువ కాలం పట్టకపోవచ్చు.