నా పేదలు నా పేదలు అంటూ.. .. మధ్యతరగతి జీవులందర్నీ నిరు పేదలు చేసేసిన సీఎం జగన్ ఇప్పుడు వారందర్నీ అమరావతిపై యుద్ధానికి పంపేందుకు సిద్ధమయ్యారు. వారిని అడ్డగోలుగా బలి ఇచ్చి అయినా తన సరే పంతం నెగ్గించుకోవాలనుకుంటున్నారు. అమరావతిలో ఇళ్ల స్థలాల పేరుతో నలభై వేల మందికి సెంట్ స్థలాలు ఇచ్చేందుకు పదకొండు వందల ఎకరాలు కేటాయించి వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. నిజానికి రాజధానిలో సీఆర్డీఏ చట్టానికి వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి చట్టబద్ధత లేదు. ఎందుకంటే ఆ విషయం కోర్టులో ఉంది. ఏ నిర్ణయం తీసుకున్నా న్యాయస్థానాన్ని ధిక్కరించడమే. అదే చేస్తున్నారు.
కోర్టుల్లో నిలబడని కేటాయింపులు చేసి … హడావుడిగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అమరావతిపై ఏమీ చేయలేక ఇలాంటి కుట్రలు పన్నుతున్నారు. రైతులు ఇచ్చిన భూముల్ని రాజధాని అవసరాలకే వాడుకోవాలన్నది మొదటి రూల్. కానీ ఇక్కడ పేదల పేరుతో కుట్రలు చేస్తున్నారు. కోర్ క్యాపిటల్ పరిధిలో అత్యంత కీలకమైన భవనాలకు కేటాయించిన భూముల్ని సెంట్ స్థలాలుగా మార్చారు. రాష్ట్ర భవిష్యత్ .. రైతులు ఇచ్చిన భూములపై కనీస కన్సర్న్ ఉన్న పాలకుడు ఎవరూ ఇలాంటి పనులు చేయరు. పేదల పేరుతో వారిని బలిచ్చే రాజకీయం చేయరు.
కోర్టులు అడ్డుకట్ట వేసినా జగన్ ఆగుతారన్న గ్యారంటీ లేదు. యాభై , ఆరవై వేల మందికి స్థలాలిచ్చి వారందర్నీ రాజధానిపై పంపుతారు. వారంతా కలిసి రాజధాని రైతులపై యుద్ధం ప్రకటిస్తారు. అప్పుడు భయంకరమైన సంఘర్షణ ఏర్పడుతుంది. సీఎం జగన్కు కావాల్సింది ఇదే. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో అధికారం కోసం మత కల్లోలాలు రేపారన్న ఆరోపణలు ఆయన కుటుంబంపై ఉన్నాయి. ఇప్పుడు ఆయన నేరుగా అమరావతిలో కులాల పోరాటం పెట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. అయితే జగన్ రాజకీయంలో సెంటు స్థలాలను చూపి తమను బలిపశువుల్ని చేయబోతున్నారని ఆ పేదలు గమనిస్తే… జగన్ కు ఎదురుదెబ్బ తగులుతుంది. వారే తిరగబడే అవకాశం ఉంది. అదే జరిగితే సీఎం జగన్ పరువు పోతుంది.