స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమానికి మద్దతు పేరుతో బీఆర్ఎస్ ఏపీలో సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. అందుకు సన్నాహకంగానే కేటీఆర్ లేఖ రాశారు. ఉద్యమకారులకు మద్దతు తెలియచేయాలని తోట చంద్రశేఖర్ ను ఆదేశించారని అంటున్నారు. కేంద్రంలోని మోడీ సర్కార్ అన్ని ప్రభుత్వరంగ సంస్థలను తన కార్పొరేట్ మిత్రులకు అప్పనంగా కట్టబెడుతోందని కేసీఆర్పలు వేదికలపై మండిపడ్డారు. ఎల్ఐసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమంలో బీఆర్ఎస్ కార్మిక విభాగం పాలు పంచుకుంది.
ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభ తర్వాతే వైజాగ్‌లో పార్టీ బహిరంగ సభకు ప్లాన్ చేసినా.. తర్వాత ఆ ఊసు ఎత్తలేదు. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించిన కేసీఆర్.. నాందేడ్ జిల్లాలో సభలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని అస్త్రంగా చేసుకొని ఏపీలో బీఆర్ఎస్ ప్రస్థానం షురూ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. సభకు సంబంధించిన ఏర్పాట్లను ఏపీ పార్టీ చీఫ్ తోట చంద్రశేఖర్,ఇతర నేతలకు అప్పగించినట్టు తెలుస్తోంది. ఈ నెలలోనే కేసీఆర్ సభ ఉండే అవకాశముందని నేతలు చెప్తున్నారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతుగా భారీ బహిరంగ సభ పెట్టి కార్మికులతో పాటు ఏపీ ప్రజల మద్దతు కూడగట్టాలనే ఆలోచనలో కేసీఆర్ఉన్నారని అంటున్నారు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారిన తర్వాత కేసీఆర్ ఏపీపై ఫోకస్ పెట్టారు. పలువురు నాయకులను చేర్చుకోవాలని ప్రయత్నించినా ఎమ్మెల్యేలు, ఇతర లీడర్ల నుంచి రెస్పాన్స్ రాలేదు. ఏపీలో జనసేన చీఫ్ పవన్‌కల్యాణ్‌తో బీఆర్ఎస్ కలిసి పనిచేయబోతోందనే ప్రచారం చేయించుకున్నారు. కానీ అదీ తేలిపోయింది. అందుకే నేరుగా సభ పెట్టి ఏపీలో అడుగు పెట్టాలనుకుంటున్నారు.
అయితే బీఆర్ఎస్ రాజకీయాలపై స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల్లో అసంతృప్తి ఉంది. వారి రాజకీయ ఎదుగుదల కోసం తమ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుంటున్నారన్న అనుమానాలు ఉన్నాయి. అందుకే ఈ విషయంలో స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. కానీ ఊరూపేరూ లేని కొంత మందిని పిలిపించి.. వారు పిలుస్తున్నారంటూ… బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు.