బీజేపీ వ్యతిరేక కూటమికి తనను చైర్మన్ ను చేస్తే ఎన్నికల ఖర్చులన్నీ పెట్టుకుంటానని కేసీఆర్ ఇతర పార్టీలకు ఇచ్చిన ఆఫర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఆయనకు అన్ని డబ్బులు ఎక్కడ్నుంచి వచ్చాయని ప్రధాని మోదీ కూడా ఆరా తీస్తున్నారని ఢిల్లీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ఈ విషయం పక్కన పెడితే అసలు కేసీఆర్ ఆఫర్‌కు ఎవరూ స్పందించకపోవడం మరింత ఆశ్చర్యకరంగా మారిందని అంటున్నారు. ఇటీవల విపక్ష పార్టీల సమావేశాలు జరుగుతున్నాయి కానీ కేసీఆర్ ను ఎవరూ పిలవడం లేదు. చివరికి స్టాలిన్ కూడా తన పుట్టిన రోజు సందర్భంగా ఓ సభ నిర్వహిస్తే ఆయనను పిలువలేదు. కానీ కేసీఆర్ మాత్రం సచివాలయం ప్రారంభోత్సవం పేరుతో ఆయనను పిలిచారు. స్టాలిన్ వస్తానన్నారు. కానీ అది వాయిదా పడింది.
డబ్బుతోనే రాజకీయాలు నడవవని ఇతర పార్టీల నేతలు అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. పైగా కేసీఆర్ తీరు డబ్బులతో రాజకీయ వ్యాపారం చేసినట్లుగా ఉందన్న అనుమానాలు ఉత్తరాది పార్టీల నేతల్లో ఉన్నాయంటున్నారు. కేసీఆర్ గతంలో సమాజ్ వాదీ పార్టీతో పాటు జేఎంఎం, వైసీపీ, జేడీఎస్ వంటి పార్టీలకు ఆర్థిక సాయం చేసినట్లుగా ప్రచారం ఉంది. ఇప్పుడు ఆ రేంజ్ ను మరింత విస్తరించింది బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటినీ కలుపుకోవాలనుకుంటున్నారు. వైసీపీ నేరుగా కలవకపోయినా సందర్భం వచ్చినప్పుడు కేసీఆర్ మాటే వింటారని ఆ పార్టీ నేతలు నమ్ముతున్నారు. జేఎంఎంతో పాటు కొంత మంది నేతలు కేసీఆర్ పిలిచినప్పుడల్లా రావడానికి ఆయన చేసిన ఆర్థిక సాయమే కారణమని అంటున్నారు.
మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ ఇటీవల ప్రత్యేక కూటమి ఏర్పాటు చేయాలని అనుకున్నారు. కానీ కేసీఆర్ ను కలుపుకోలేదు. రాహుల్ గాంధీపై విధించిన అనర్హతా వేటును కేసీఆర్ ఖండించారు కానీ ఎప్పుడూ ఆయన విపక్షాల మీటింగ్ కు వెళ్లడం లేదు.. దీంతో కేసీఆర్ పై పెద్దగా జాతీయ నేతలు ఎవరూ నమ్మకం పెట్టుకోవడం లేదని అంటున్నారు. మొత్తంగా కేసీఆర్ ప్రగతి భవన్ దాటని రాజకీయం…ఆర్థిక సాయం అంటే అంతరూ తన వెంటే వస్తారన్న నమ్మకంతో జాతీయ పార్టీ పెట్టారన్న అభిప్రాయాలు బలపడుతున్నాయి. కారణం ఏదైనా కేసీఆర్… వెంట నడవడానికి ఒక్క పార్టీ కూడా రావడం లేదు. మహారాష్ట్ర నుంచి దశాబ్దాల కిందట వార్డు మెంబర్లుగా గెలిచిన వారు వచ్చి కండువాలు కప్పించుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వారు కూడా రావడం లేదు.