వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తెలంగాణలో ఎలాంటి రాజకీయాలు చేయాలో అర్థం కాక ..విచిత్రమైన ప్రయత్నాలు చేస్తూ నలుగురిలో నవ్వుల పాలవుతున్నారు. పేపర్ లీకేజీల అంశంపై పోరాడటానికి తన పార్టీ కార్యకర్తల బలం సరిపోదని ఆమె భావించినట్లుగా ఉన్నారు. ఇతర పార్టీలతో కలిసి పోరాడితే వారి కార్యకర్తలు అయినా కలసి వస్తారని ప్లాన్ చేసుకున్నారు. అందుకే ఆ పార్టీ.. ఈ పార్టీ అనే తేడా లేకుండా అందర్నీ సంప్రదిస్తున్నారు. తాజాగా ఆమె సీపీఎం నేత వీరభద్రాన్ని కలిసినప్పుడు ఆమెను మరీ తేలికగా తీసుకుని మాట్లాడారు వీరభద్రం.
సీపీఎం ఆఫీసుకు వెళ్లిన షర్మిల టీ సేవ్ పేరుతో ఫేరం ఏర్పాటు చేసుకుని అన్ని పార్టీలతో కలిసి పోరాడదామని కోరారు. అయితే తమ్మినేని మాత్రం.. బీజేపీ చేసే ఆకృత్యాలపై పోరాడరా అని ప్రశ్నించారు. షర్మిల పార్టీని బీజేపీ బీటీంగా పేర్కొన్నారు. దీంతో షర్మిల హర్టయ్యారు. తమది బీ టీం కాదని సీపీఎంనే బీ టీం అని.. బీఆర్ఎస్ కోసం పని చేస్తున్నారని ఆరోపించారు. తాము నేరుాగనే కలిసి పని చేస్తున్నామని తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. దీంతో షర్మిల అవమానకరంగా సీపీఎం ఆఫీసు నుంచి వెళ్లి పోవాల్సి వచ్చింది.
అసలు టీ సేవ్ అనే ఫోరంను పెడదామనిషర్మిల అనుకున్నారు కానీ ఒక్కరంటే ఒక్కరూ కలిసి రావడంలేదు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌లకు ఫోన్ చేశారు కానీ వారు.. పొలైట్‌గానే కుదరదని చెప్పారు. పరువు తీయలేదు. తాను కలుస్తానంటే ఇతర పార్టీల నేతలు అంగీకరిస్తున్నారు. కానీ ఆలోచిస్తామని చెబుతున్నారు. కోదండరాం కూడా చూద్దామని చెప్పి పంపించారు. కానీ తమ్మినేని వీరభద్రం మాత్రం షర్మిల రాజకీయాల్ని తేలికగా తీసుకున్నారు. ఇలాంటి పరిస్థితులు ఎదురైనా టీ సేవ్ ఫోరం కోసం ప్రయత్నిస్తానని షర్మిల అంటున్నారు. ఎవరికి వారు పోరాటం చేసుకుంటున్నారు కానీ… కలిసి పోరాటం చేయాలని తెలంగాణలో రాజకీయ పార్టీలు అనుకోవడంలేదు.