పార్టీ క్యాడర్ మొత్తం జనంలోకి తిరగాలని మళ్లీ వైసీపీని గెలిపించాలని జగన్ దాదాపుగా ప్రాథేయపడుతున్నారు. కానీ ఆయన మాత్రం తాడేపల్లి క్యాంప్ ఆఫీసు నుంచి అడుగు బయట పెట్టడానికి సిద్ధపడటం లేదు. మీటల్ని నొక్కడానికి జిల్లాలకు వెళ్తున్నారు. అది పరదాల పర్యటనగా మారిపోయింది. కానీ ఆయన జనంలోకి వెళ్లడం లేదు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లవుతోంది. ప్రజల్ని నేరుగా కలిసిన సందర్భమే లేదు. ప్రజల్ని కలిసేందుకు ప్రజాదర్బార్ పెడతామని నాలుగేళ్లుగా చెబుతూనే ఉన్నారు. కానీ పెట్టలేదు.
ఇటీవల విశాఖకు పాలన మార్చి… గ్రామాల పర్యటనకు వెళ్తానని అక్కడ పల్లె నిద్ర చేస్తారని చెప్పుకున్నారు. అది కూడా మారిపోయింది. ఇప్పుడు అసలు ఉంటుందో ఉండదో స్పష్టత లేదు. కానీ సీఎం జగన్ కు చెప్పుకుందాం అనే ఓ కార్యక్రమానికి రూపకల్పన చేసి.. ఇక తాను జనాల్లోకి వెళ్లాల్సిన పని లేదనే అభిప్రాయాన్ని కల్పించడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అదే అభిప్రాయంతో ఉంటే ఇక సీఎం జగన్ ఎన్నికల ప్రచారానికి మాత్రమే బయటకు వచ్చే అవకాశం ఉంది. తాను మూల విరాట్ గా కూర్చుంటానని తన కోసం అందరూ తిరగాలన్నట్లుగా జగన్ తీరు ఉండటం వైసీపీలో ఆశ్చర్యానికి కారణం అవుతోంది.
ముఖ్యమంత్రి కనీసం మీడియా సమావేశాలు కూడా పెట్టరు. ఎప్పుడైనా సమావేశం పెట్టారంటే అది రికార్డెడ్ వీడియో బయటకు వస్తుంది. మీడియాతో మాట్లాడేంత విషయ పరిజ్ఞానం ఆయనకు ఉండదని ఏదైనా చూసి చదవడమే చేస్తారని అంటున్నారు. ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తే… అక్కడ వివిధ అంశాలపై ప్రజలు అడిగే వాటికి సమాధానం చెప్పడం కష్టమవుతుందని అంటున్నారు. ఎంత ఆర్గనైజ్డ్ గా నిర్వహించాలనుకున్నా ఇది పెద్ద సమస్య అవుతుందని భావిస్తున్నారు. అందుకే సీఎం జగన్ జనాల్లోకి వెళ్లడానికి వెనుకడుగు వేస్తున్నారని చెబుతున్నారు.