తెలంగాణ రాజకీయం ప్రచారాల మీదనే నడుస్తోంది. ఇంత కాలం ఏపీలో అలాంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అది తెలంగాణకు విస్తరించింది. అసలు లీక్ కాని టెన్త్ పేపర్ లీకేజీ అనే మాల్ ప్రాక్టిస్ కేసులో బండి సంజయ్‌ను కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. కరీంనగర్లో ఆయనపై నమోదు చేసిన కేసు చూస్తే ఆయనను ప్రివెన్షన్ అరెస్ట్.. అంతే ముందుజాగ్రత్త అరెస్ట్ చేసినట్లుగా స్పష్టమవుతుంది. ఆయన పేపర్ లీకేజీలను కారణం చూపి రెచ్చగొట్ట ప్రయత్నం చేస్తున్నారని.. లా అండ్ ఆర్డర్ సమస్యలకు కారణం అవుతారని అరెస్ట్ చేస్తున్నట్లుగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
కమలాపూర్‌లో నమోదైన కేసు ఎఫ్ఐఆర్ కూడా వెలుగులోకి వచ్చింది. అయితే అందులోనూ ఆ స్కూల్ హెడ్ మాస్టర్ ఎవరిపైనా అనుమానాలు వ్యక్తం చేయలేదు. గుర్తు తెలియని వ్యక్తులు అని ఫిర్యాదు చేశారు. కరీంనగర్‌లో బండి సంజయ్‌ను ప్రివెన్షన్ అరెస్ట్ చేసిన పోలీసులు మొదట హైదరాబాద్ తరలించారు.. తర్వాత వరంగల్ వైపు తరలించారు. దీంతో కమలాపూర్ లో హిందీ ప్రశ్నాపత్రం లీకైన కేసులో – . బండి సంజయ్‌పై కేసు నమోదు చేసి ఉంటారని భావిస్తున్నారు. అయితే బండి సంజయ్ ఎలాంటి నేరానికి పాల్పడ్డారన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు.
పేపర్ ఇలా బయటకు రావడం వెనుక బండి సంజయ్ కుట్ర ఉందని బయట బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. పేపర్ బయటకు పంపిన నిందితుడికి బండి సంజయ్ చాలా సార్లు కాల్ చేశారని… ఆయనకు ప్రశ్నాపత్రం వాట్సాప్ లో అందిందని ప్రచారం చేస్తున్నారు. అయితే పరీక్షఅయిపోయిన రెండు గంటల తర్వాత బండి సంజయ్ ఫోన్‌కు పేపర్ వస్తే కుట్ర ఎలా అవుతుందని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ వవ్యహారం రాజకీయ దుమారం రేగుతోంది. బండి సంజయ్ పై ఎన్ని కేసులు నమోదయ్యాయన్నది కూడా స్పష్టత రావాల్సి ఉంది.
అయితే ముందుగానే విచారణ జరిపేసి.. బండి సంజయ్ నేరం చేసేశారని.. బీఆర్ఎస్‌తో పాటు టీవీ9 లాంటి మీడియా కూడా విస్తృతంగా ప్రచారం చేస్తోంది.