నిర్మాతగా పరిశ్రమలో నేటితో ఇరవైఏళ్ళు పూర్తి చేసుకున్నారు దిల్ రాజు. ఆయనది విజయవంతమైన ప్రయాణం. పంపిణీదారుగా వున్న అనుభవంతో నిర్మాణంలోకి వచ్చిన రాజు.. తొలి సినిమా పేరునే దాదాపు ఇంటి పేరుగా మార్చుకున్న విజయం ఆయనది. శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ సినిమా అంటే ఒక నమ్మకం. ఈ నమ్మకం కలిగించడంలో దిల్ రాజు కృషి చాలా వుంది. సినిమా నిర్మించే స్తోమత చాలా మందికి ఉండొచ్చు. కానీ సరైన ప్రతిభని పట్టుకునే సామర్ధ్యం మాత్రం కొందరికే వుంటుంది. ఆ కొందరిలో దిల్ రాజు ముందు వరుసలో వుంటారు.
కథల పట్ల జడ్జ్ మెంట్:
దిల్ తర్వాత ఆయన వచ్చిన ఆర్య భద్ర బొమ్మరిల్లు ఒకదానికి మంచి ఒకటి విజయాల్ని అందుకున్నాయి. కొత్త దర్శకులని నమ్మడంలో కూడా దిల్ రాజుది ప్రత్యేకమైన శైలి. ఆయన జడ్జ్మెంట్ బావుంటుంది. వన్ సైడ్ లవర్ అనే కాన్సెప్ట్ తో సుకుమార్ కథ చెబితే.. అందులో విషయం వుందని గుర్తించారు. మళ్ళీ దాన్నే సీక్వెల్ చేసినప్పుడు నిర్మాణం జోలికి పోలేదు. కథల పట్ల దిల్ రాజుకి వున్న జడ్జ్ మెంట్ దీనికి బట్టి అర్ధం చేసుకోవచ్చు.
నిర్మాతగా కొత్త బంగారు లోకం:
దిల్ రాజు కి మున్నాతో తొలి నిరాశ ఎదురైయింది. అయితే వెంటనే అల్లు అర్జున్ తో ‘పరుగు’ పెట్టారు. అల్లు అర్జున్ కెరీర్ లో చాలా మందికి ఫేవరేట్ సినిమా అది. ఇప్పటికీ నమ్మవేమో గానీ, మనకంటే పొడిచే పాటలు యూత్ లో వినిపిస్తూనే వుంటాయి. ఒక వైపు పెద్ద సినిమాలు చేస్తూనే మరో వైపు చిన్న, మీడియం సినిమాలతో విజయాలు అందుకున్నారు దిల్ రాజు. కొత్త బంగారు లోకం ఆయన కమర్షియల్ సక్సెస్ తో పాటు మంచి పేరు తీసుకొచ్చింది.
దిల్ రాజు సినిమా ఓ అందమైన జ్ఞాపకం:
సినిమా అనేది మంచి జ్ఞాపకం. చిన్నప్పుడు చూసిన సినిమాలు, టెన్త్ క్లాసులో చూసిన సినిమాలు, ఇంటర్ లో చూసిన సినిమాలు.. ఇలా ఒక జాబితా వుంటుంది. అలాంటి జాబితాలో గుర్తుపుట్టుకునే సినిమాలు నిర్మించారు దిల్ రాజు. ఆర్య సినిమా ఒక ట్రెండ్ సెట్ చేసింది. అప్పట్లో అదొక ప్యాషన్.
కుదిరితే కప్పు కాఫీ అనే డైలాగు, ఆ పాటలని గుర్తుపెట్టుకునే బొమ్మరిల్లు ఫ్యాన్స్ ఎంతో మంది వున్నారు. సినిమా అంతా సరదాగా నవ్వుకొని చివర్లో ‘’బతుకంటే బడి చదువా.. అనుకుంటే అతి సులువా’’ అనే మాటల్ని విని థియేటర్ నుంచి బరువైన గుండెతో బయటికి వచ్చిన కొత్త బంగారు లోకం అభిమానులు ఎందరో.
హీరోలకు బెస్ట్ మూవీస్ :
చాలా అందరి హీరోలకి కెరీర్ బెస్ట్ సినిమాలు ఇచ్చారు దిల్ రాజు. నితిన్ కి దిల్, అల్లు అర్జున్ కి ఆర్య, రవితేజ కి భద్ర, ప్రభాస్ మిస్టర్ పర్ఫెక్ట్, ఎన్టీఆర్ కి బృందావనం, మహేష్ బాబు, వెంకటేష్ లకు సీతమ్మ వాకిట్లో, రామ్ చరణ్ కి ఎవడు, సాయి ధరమ్ తేజ్ కి సుప్రీమ్, వరుణ్ తేజ్ కి ఫిదా, శర్వాకి శతమానం భవతి, నానికి మిడిల్ క్లాస్ అబ్బాయి, పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ ఇలా తను చేసిన అందరి హీరోల జాబితాలో దిల్ రాజు విజయాలు వున్నాయి.
దిల్ రాజు ప్రత్యేకత:
దిల్ రాజు సినిమా అంటే కుటుంబం అంతా కలసి చూడొచ్చనే పేరుని తెచ్చుకున్నారు. సినిమా పట్ల ఆయనకు వున్న దృక్పథం వల్లే ఇది సాధ్యపడింది. మంచి పాటలు, కుటుంబం, అనుబంధాలు, భావోద్వేగాలు.. వీటినే ఎంత కొత్తగా చూపించవచ్చనే అంశంపైనే ఆయన ద్రుష్టి పెట్టారు కానీ.. శ్రుతి మించిన సంచలనాల జోలికి ఏనాడూ పోలేదు. ఇదే ఆయనకి ప్రత్యేకతని తీసుకోచ్చింది.
పాన్ ఇండియా గేమ్ చేంజర్ గా అడుగులు :
ట్రెండ్ ని పట్టుకోవడం దిల్ రాజు ఎప్పుడూ ముందుటారు. ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకొని మార్పులు గమనిస్తూ నిర్మాణం చేయడంలో ఆయన దిట్ట. కంటెంట్ ప్రధానంగా వుండే సినిమాలు చేయాలనే ఉద్దేశం తీసిన ‘బలగం’ ఆయనకి మంచి పేరుతీసుకొచ్చింది. మరిన్ని కంటెంట్ సినిమాలు చేయాలనే సన్నాహాలు చేస్తున్నారు.
ఇక మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో వచ్చిన మార్పుని కూడా ఆయన పట్టుకున్నారు. ఇప్పుడు ప్రతి సినిమా పాన్ ఇండియా అవుతుంది. అందులో భాగంగా తమిళ హీరో తీసిన వారిసు అక్కడ మంచి పేరు తీసుకొచ్చింది. ఇప్పుడు తమిళ ప్రేక్షకులందరికీ దిల్ రాజు పరిచయం. శంకర్ రామ్ చరణ్ లతో చేస్తున్న గేమ్ చేంజర్ కూడా పాన్ ఇండియా విడుదల కాబోతుంది. దిని తర్వాత ఆయన చేసే సినిమాలు దాదాపు పాన్ ఇండియా మార్కెట్ ని ద్రుష్టిపెట్టుకొని చేయాలనేది ఆయన ఆలోచన.
విజయవంతగా ఇరవై ఏళ్ళు పూర్తి చేసుకున్న దిల్ రాజు ప్రయాణం మరింత గొప్పగా విజయవంతంగా ఉండాలని కోరుకుంటూ దిల్ రాజుకు శుభాకాంక్షలు.