తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా ఎవరి వల్ల సంచలనాలు నమోదు చేసిందంటే.. ముందుగా చెప్పాల్సిన పేరు రవి ప్రకాష్. టీవీ9 అనే శాటిలైట్ చానల్‌ను అతి తక్కువ పెట్టుబడితో ప్రారంభించి.. దాన్ని అంచెలంచెలుగా దేశంలోనే ప్రముఖ మీడియా నెట్ వర్క్‌గా విస్తరింపచేశారు. ఇటీవల ఆయన ఆ సంస్థ నుంచి బయటకు రావాల్సి వచ్చింది. కొంత కాలం సైలెంట్ గా ఉన్న ఆయన ఇప్పుడు మరో సారి టీవీ చానల్స్‌ను లాంచ్ చేస్తున్నారు.
ఆర్ టీవీ పేరుతో ఇప్పటికే ఈ చానల్‌కు సంబంధించిన పూర్తి స్థాయి సన్నాహాలు పూర్తయ్యాయి. ఒక్క తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ ఈ టీవీ చానల్ లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొంత కాలంగా టీవీ9లో పని చేసి మానేసిన జర్నలిస్టులతో పాటు పలువుర్ని రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇటీవల రిక్రూట్ మెంట్ ప్రాసెస్ వేగం పంజుకుంది. ఇక టెక్నాలజీ పరంగా తెలుగు టీవీ చానళ్ల దగ్గర లేని అత్యాధునిక టెక్నాలజీని వినియోగించబోతున్నారు.
తెలుగు మీడియా రంగం ఇప్పుడు పూర్తి స్థాయిలో విభజనకు గురైంది. ప్రభుత్వానికి వ్యతిరేక వార్తలు ఇచ్చేవి.. టీడీపీ అనుకూలం.. ప్రభుత్వ అనుకూల వార్తలు ఇచ్చేవి వైసీపీ అనుకూలం అన్నట్లుగా మారిపోయాయి. దీంతో నిఖార్సైన చానల్ కోసం వీక్షకులు ఎదురు చూస్తున్నారని అనుకోవచ్చు. ఈ గ్యాప్ ను ఫిల్ చేయడానికి రవిప్రకాష్ ప్రయత్నించే అవకాశం ఉంది.