కోమటిరెడ్డి సోదరులు రాజకీయంగా చేసిన తప్పులతో ఏ పార్టీలోనూ స్థిరంగా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. తమ్ముడు రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరి ఉన్న ఎమ్మెల్యే పదవిని ఊడగొట్టుకోగా.. అన్న కాంగ్రెస్ పార్టీలో ఉండి ..చివరికి అవమానాలు ఎదుర్కొంటున్నారు. ఇదంతా వారు చేసుకున్న స్వయంకృతాపరాథమే. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేశారని.. కొత్త పార్టీ పెడుతున్నారని ఉదయమే ఓ పుకారు లేచింది. దీన్ని మీడియా కూడా విస్తృత ప్రచారం చేసింది. ఈ ప్రచారం ఎలా జరిగిందో కోమటిరెడ్డికి మాత్రమే తెలుసు. కానీ కాసేపటికి ఆయన నుంచి ఖండన ప్రకటన వచ్చింది.
తనది కాంగ్రెస్ రక్తమని.. పార్టీ మార్పు వార్తలను ఖండించారు. భువనగిరి పార్లమెంట్ నుంచి ఎన్నికైన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై మొదటి నుంచి ఇలాంటి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. తన తమ్ముడు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారినప్పుడు కూడా ఈయన బీజేపీలోకి వెళ్తున్నారని ప్రచారం నడిచింది. అయితి అదంతా బోగస్ అని అప్పట్లో వివరణ ఇచ్చారు వెంకట్‌రెడ్డి. మళ్లీ ఇన్ని రోజులు తర్వాత మళ్లీ పార్టీ మారుతున్నారన్న ప్రచారం ఊపందుకుంది.
తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి పార్టీ పెడుతున్నట్టు ప్రత్యర్థులు, గిట్టని వారు చేస్తున్న ప్రచారంగా కోమటిరెడ్డి వివరణ ఇస్తున్నారు. ఇలాంటి వార్తలు నమ్మొద్దని విజ్ఞప్తి కూడా చేస్తున్నారు. మీడియా సంస్థలు ఫేక్ న్యూస్ ప్రచారం చేయడం కరెక్ట్ కాదని సూచించారు. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాను అధికారికంగా ప్రెస్‌మీట్ పెట్టి మరీ చెబుతానన్నారు. ఇప్పటి వరకు తాను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. తాను కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నానంటూ కూడా ప్రచారం చేస్తున్నారని ఇది కూడా తప్పని కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు. తన ముందు ఎలాంటి ఆప్షన్స్ లేవని…తనది కాంగ్రెస్ రక్తమని చెప్పుకొచ్చారు కోమటిరెడ్డి. బీజేపీ నుంచి కూడా ఎలాంటి ఆఫర్లు లేవన్నారు. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పాల్సిన అవసరం తనకు లేదన్నారు.
కోమటిరెడ్డి పరిస్థితిని చూసి ఆయన ప్రత్యర్థులే… ఈ ప్రచారం చేయిస్తున్నారని దీంతో వివరణ ఇచ్చుకోలేక.. మరో వైపు తన నిజాయితీని నిరూపించుకోలేక ఆయన తంటాలు పడుతున్నారని రాజకీయవర్గాలు చెబుతున్నాయి.