ఒక్క చాన్స్ ఇచ్చి రాజకీయ భవిష్యత్ కల్పించమని ఊరూవాడా తిరిగి వేడుకున్న స్థితి నుంచి నేనే మీ భవిష్యత్ అని బెదిరించడం వరకూ చాలా వేరంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం నాలుగేళ్లలో ఎవరూ ఊహించని స్థితికి చేరింది. అంటే అహం బ్రహ్మస్మి అనే స్థితికి వచ్చేసింది. అది ఎదగడమో.. దిగజారడమో ప్రజలు నిర్ణయిస్తారు. కానీ చరిత్రను చూస్తే ఇలా ప్రజలు ఇచ్చిన అధికారంతో అహంకారంతో వ్యవహరిస్తే అదే ప్రజలు వారిని రాజకీయ సమాధి చేసిన దృష్టాంతాలు కోకొల్లలుగా ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఇలా ప్రజలిచ్చిన అధికారంతో అహంకారం పెంచేసుకుని నేను లేకపోతే మీరు లేరు అనే స్థాయికి వచ్చిన ఏ ఒక్క రాజకీయ నాయకుడు ఎక్కువ కాలం మనలేదు. చాలా త్వరగానే ఆ నేతలకు ప్రజలకు .. నువ్వ లేకపోతే కాదు.. మేము లేకపోతేనే నువ్వు లేవని దారి చూపించారు. అదే అధికారంతో వారిని భయపెట్టాలని చూసినా జరగాల్సినది మాత్రం జరిగిపోయింది. నియంతరలకే అలాంటి ఎండింగ్ తప్పలేదు. ప్రజాస్వామ్యంలో అయితే ఇక చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా నేను లేకపోతే మీకు భవిష్యత్ లేదంటూ ప్రజల్ని బెదిరించడానికి వంది మాగధుల్ని ఇళ్లపైకి పంపుతున్నారు.
అధికార అహంకారంతో ప్రజల్ని బెదిరించడానికే ఇంటింటికి వైసీపీ కార్యకర్తలు
” జగనన్న పంపిన వాళ్లు మీ ఇంటికొస్తారు. మిస్డ్ కాల్ ఇవ్వమంటారు. ఇంటికి స్టిక్కర్ అంటిస్తారు…” అందరూ సహకరించండి అని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు సూచించారు. ప్రతి ఇంటికి వెళ్తామని ఆయన ప్రకటించారు. అయితే ఏదైనా స్వచ్చందమే అని ఆయన చెప్పుకొచ్చారు. కానీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే ఏం జరుగుతుందో ఇప్పటికే కథలు కథలుగా ప్రచారమయ్యేలా ఘోరమైన పనులు చేసిన ప్రభుత్వం నుంచి వచ్చిన ఎవరైనా మాకొద్దీ స్టిక్కర్లు అనే ధైర్యం చేయగలుగుతారా ? ముఖ్యంగా పేదలు.. చిరుద్యోగులు.. మధ్యతరగతి కుటుంబాలు. చేయలేరు.. ఆ విషయం సజ్జల రామకృష్ణారెడ్డికి తెలుసు. అందుకే ప్రతీ ఇంటికి స్టిక్కర్ అంటిస్తామని ఇంకా.. చెప్పాలంటే వారి ఫోన్లకు కూడా స్టికర్ అంటిస్తామని బరి తెగించి చెబుతున్నారు. కాదు కూడదంటే వారి పథకాల్ని ఎత్తి వేస్తామని దాడులకు పాల్పడతామనే సందేశాలు ఇప్పటికే అన్ని స్థాయిల్లో చేరిపోయాయి. నిజానికి ఇదో పెద్ద స్కాం. ప్రజాస్వామ్యానికి పాతరేసే స్కాం. ప్రతి ఇంటికి వెళ్లేది వైసీపీ మనుషులు. వాలంటీర్లు, గృహసారధులు. వీరంతా వెళ్లి మాట్లాడి వారు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారో లేదో తెలుసుకుంటారు. ప్రభుత్వానికి అనుకూలం అని నమ్మకం కలిగితే సరే.. లేకపోతే వారికి తర్వాత సినిమా చూపిస్తారు. అంతిమంగా వారి ఓట్లను టార్గెట్ చేస్తారు. రాయలసీమ రాజకీయాల్లో జరిగేది ఇదే. పాలెగాళ్లు ఎన్నికలను నియంత్రించినప్పుడు .. ఓటర్లను ఓటు వేయడానికి రానిచ్చేవారు కాదు. తామే బ్యాలెట్ బాక్సుల్లో గుద్దుకునేవారు. అలా కాకపోతే.. తమకు వ్యతిరేకంగా ఓట్లుపడతాయి అనుకున్నప్పుడు ఆయా ఓటర్లు ఓటింగ్ కు రాకుండా భయకంపితులు చేస్తారు. వస్తే ఏం జరుగుతుందో తెలుసుగా అని హెచ్చరిస్తారు. ఇప్పుడు కూడా అలాంటి మార్కింగ్ కోసమే ఈ … జనగన్నే మా భవిష్యత్ అనే కార్యక్రమాన్ని సిద్ధం చేశారు. ఇలాంటి ఐడియాలను ఇవ్వడానికే ఐ ప్యాక్‌ను పెట్టుకున్నారు. వారు ఇస్తున్నారు. వీరు పాటిస్తున్నారు. కానీ ప్రజల్ని ఇంత తక్కువగా అంచనా వేయవచ్చా అన్న అంశాన్ని మాత్రం పరిగణనలోకి తీసుకోవడం లేదు.
రాష్ట్రానికి భవిష్యత్ లేకుండా చేసి ఈ ప్రచారం ఎందుకు ?
ప్రజల నమ్మకం పొందాల్సింది పాలకులు. వారి నమ్మకం కోల్పోయాక చేసేదేమీ ఉండదు. ప్రస్తుత ప్రభుత్వ పాలకులు ప్రజల నమ్మకాన్ని కోల్పోయారని కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు పూర్తిగా తిరస్కరించారు. ఈ తిరస్కరణ ఎంత ఘోరంగా ఉందంటే పులివెందులలో పట్టభద్రులు కూడా ఓట్లు వేయలేదు. ఇదే నిజం. పట్టభద్రుల్లో తమ పథకాలు అందుకున్న వారు ఇరవై శాతం మందేనని తమను తాము మోసం చేసుకోవడమో.. .లేదా అలా చెప్పుకునిప్రజల్ని మోసం చేయడమే చేస్తున్నారు కానీ.. నిజం ఏమిటో రాజకీయాలపై కనీస అవగాహన ఉన్నవారికీ అర్థమవుతుంది. నిజానికి ఇది మేలు కొలుపు కావాలి. ఎందుకంటే అసలైన తీర్పు చెప్పడానికి ఏడాది ముందు ప్రజలు ఇచ్చిన సందేశం ఇది. దీన్ని అర్థం చేసుకోకుండా… ఏదో చేస్తానని బయలుదేరితే మొదటికే మోసం వస్తుంది. అసలు రాష్ట్రానికి భవిష్యత్ లేకుండా చేశాని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. కొత్త ఆర్థిక సంవత్సరంలో ఏడో తేదీ వచ్చినా సగం మందికి జీతాలు, పెన్షన్లు ఇవ్వలేకపోయారంటే.. .భవిష్యత్ ను ఉంచినట్లా.. నాశనం చేసినట్లా…? . కాగ్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఏపీ ప్రభుత్వం చేస్తున్న అప్పులకు వడ్డీ 13.99 శాతం. అంత భారీ వడ్డీకి తెచ్చిన వ్యక్తి ఎవరైనా సరే… ఆర్థికంగా ఎప్పటికైనా కుప్పకూలిపోతారు. ముఖ్యంగా అలా అప్పులు చేసి జల్సాలకు ఖర్చు పెట్టిన వారు చాలా వేగంగా దివాలా తీస్తారు. ప్రభుత్వం ఇంత భారీ వడ్డీరేటుతో అప్పులు తెచ్చి చేసిందేమింటి ? పిసరంత పంచి.. కొండంత అవినీతికి పాల్పడి మొత్తం ఖర్చు పెట్టేయడమే. ఇప్పుడు ఆ అప్పులు ఎలా కడతారు ? . ప్రజలపై పన్నులేసి లాగాలి. అసలు అస్తవ్యస్థ ఆర్థిక విధానాలతో ప్రజల్ని అప్పుల పాలు చేసి.. ఇంకా వారిపై పన్నులు బాదేస్తే.. ఎక్కడ్నుంచి తెచ్చి పెడతారు ?
పేదల్ని అప్పుల ఊబిలోకి నెట్టి నేనే మీ భవిష్యత్ అంటే ఊరుకుంటారా ?
నిజానికి పేదలకు నేను తప్ప మీకు భవిష్యత్ లేదనే స్థితికి ఇప్పటికే తెచ్చారు. “శత్రువుల్ని ఆర్థికంగా కుంగదీసి.. తిండి కూడా లేకుండా చేయడం.. తర్వాత వారికే జాలితో రెండు ముద్దలు పడేసి ఆకలి తీల్చి.. జేజేలు అందుకోవడం” అనేది రాయలసీమలో ఫ్యాక్షనిస్టుల వ్యూహం. సీఎం జగన్ దాన్నే విస్తృత పర్చి ఏపీలో మెజార్టీ ప్రజులపై ప్రయోగిస్తున్నారు. కుల, మత, పార్టీలు చూడకుండా పేద ప్రజల్ని పీల్చి పిప్పి చేసి వారిని నానా రకాలుగా ఆర్థికంగా బలహీనుల్ని చేసి..అప్పులపాలు చేసి చివరికి పథకాల పేరుతో వారికి రెండు ముద్దలు పడేసి.. ఆకలి తీర్చామని .. దేవుళ్లమని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైనా తమకు ఓటు వేసి అధికారం ఇచ్చిన వారిని బాగా చూసుకుంటారు. వారు మళ్లీ ఓట్లు వేయకపోతే తమకు అధికారం రాదని భయపడతారు. కానీ జగన్ రాజకీయాలు మాత్రం భిన్నం. తమకు ఓట్లు వేసిన వర్గాలను రాచి రంపాన పెడుతున్నారు. ఎన్నిరకాలుగా అంటే.. అన్ని రకాలుగా వారి వద్ద పిండుకుంటున్నారు. అప్పుల పాలు చేస్తున్నారు. చివరికి వారి కుటుంబాలు బతకాలంటే.. ప్రభుత్వం వైపు చూడాలన్నట్లుగా చేస్తున్నారు. ఓటు బ్యాంక్‌గా వర్గాలను పీల్చి పిప్పి చేసి.. తిండి లేకుండా చేసి.. రెండు ముద్దలు పడేస్తే.. ఇక ముందు ఏ సమస్యా లేకుండా.. ఎలాంటి డిమాండ్లు పెట్టకుండా తమకే ఓట్లేస్తారనే ఫ్యాక్షన్ వ్యూహాన్ని తెరపైకి తెచ్చి పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఈ ఫ్యాక్షన్ రాజకీయ వ్యూహంలో చిక్కిన ఏపీ ప్రజలు నాలుగేళ్లుగా చిక్కిశల్యమైపోతున్నారు. పేదలు ఇప్పుడు పథకాల కోసం ఎదురు చూసి.. తమకు ప్రభుత్వం ఇచ్చే … కొద్ది మొత్తంతో ప్రభుత్వమే సృష్టించిన ఖర్చులకు వెచ్చించి.. సంతోషఫడాల్సి వస్తోంది. అదనంగా ప్రభుత్వమే .. దింపిన ఉప్పుల ఊబి నుంచి బయటపడటానికి మరో ఆలోచన చేయడానికి అవకాశం లేకుండా చేసేశారు. ఫ్యాక్షన్ మార్క్ రాజకీయం ఇప్పుడు ఏపీ పేదల్ని నిలువునా ముంచేసింది. అందుకే నేనే మీ భవిష్యత్ అంటూ సీఎం జగన్ ప్రజల వద్దకు వెళ్తున్నారు.
ప్రజలు భవిష్యత్ ఇచ్చారనే సంగతి గుర్తు పెట్టుకుంటే ఇలాంటి ఆలోచనలు రావు !
ప్రజలకు నేను భవిష్యత్ ఇస్తా అంటూ వెళ్లే ముందు … వాళ్లే తనకు భవిష్యత్ ఇచ్చారన్న ఒక్క విషయాన్ని గుర్తు పెట్టుకుంటే.. ఇలాంటి ఆలోచనలు వచ్చి ఉండేవి కావు. గత ఎన్నికల్లో తాను ఓడిపోతే అక్రమాస్తుల కేసుల్లో శిక్ష వేస్తారని ఇక తనకు రాజకీయ జీవితమే కాదు అసలు జీవితమే ఉండదని ప్రజల దగ్గర ఏడ్చి మరీ ఓట్లు పొందారు. అంటే అది ప్రజలు ఇచ్చిన భవిష్యత్. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అనుభవిస్తున్నది ప్రజలు ఇచ్చిన భవిష్యత్. అలాంటి పరిస్థితిని అర్థం చేసుకోకుండా.. నేను మీకు భవిష్యత్ ఇస్తానంటూ బయలుదేరితే ప్రజలు ఏమనుకుంటారనే కనీస ఆలోచన చేయలేదే. పాలుకుడు అనే వాడు తన పాలనతో.. మీకు .. మీ పిల్లలకు భవిష్యత్ బాగుండేలా ఓ సమాజాన్ని తీర్చిద్దిద్దుతానని భరోసా ఇవ్వగలగాలి. అలాంటి ప్రయత్నాలు చేయాలి. అంతే కానీ.. నేను లేకపోతే మీకు భవిష్యత్ లేదంటే.. అలాంటి వారి భవిష్యత్ నిజంగా ఎలా ఉంటుందో చూపించడానికి సిద్ధంగా ఉంటారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో శాంపిల్ చూపించారు. ఇప్పటికైనా అహంకారాన్ని మార్చుకోకపోతే సినిమా చూపిస్తారు.
” ఆత్మవిశ్వాసం లేని జీవుడు అంతరాత్మ గొంతు నొక్కేస్తాడు. ఆత్మవంచనకు పాల్పడతాడు .అంతరాత్మను విడిచిపెట్టి బాహ్యంగా ఉన్న జగత్తును -అర్ధకామాలను,పేరు ప్రఖ్యాతుల్ని ,ఇతరుల సానుభూతిని ఆశ్రయిస్తాడు. వాటిని అదే పనిగా అన్వేషిస్తూ వాటికోసం హత్యలు చేస్తాడు.లేదా ఆత్మహత్యకు పాల్పడతాడు. ‘ ఇది భగవద్గీతలో ఓ మాట. ఎన్నో వందలు.. వేళ్ల కిందటే చెప్పిన సత్యాలివి. భగవద్గీతలో అదే చెప్పారు. బైబిల్లో అదే చెప్పారు. ఖురాన్‌లోనూ ఇదే చెప్పారు. పదాలు.. బాషల్లో తేడా ఉండవచ్చు కానీ.. అర్థం మాత్రం మారదు. ఇప్పుడు అధికారం పొందిన చాలా మంది మధ్యలో ఉన్నారు. వాస్తవాల్ని తెలుసుకోలేకపోతున్నారు . అలాంటి వారికి కనువిప్పు కలిగించడానికే.. మత గ్రంధాల్లో ఇలాంటి వాటిని రచించారు. కానీ అర్థం చేసుకునే విధానంలో తేడా వస్తే పతనమయ్యేదాకా నిజాల్ని గుర్తించరు. ఇప్పుడు జరుగుతోంది అదే. మారకపోతే జరగబోయేది కూడా ఈ సందేశంలోనే ఉంది.