నాటు… నాటు’ పాటతో ఆస్కార్ తెచ్చి తెలుగు చిత్రసీమ ఖ్యాతిని మరింత పెంచారు కీరవాణి, చంద్రబోస్. ఇప్పుడు వీరిద్దరినీ టాలీవుడ్ ఘనంగా సత్కరించుకోబోతోంది. ఈ ఆదివారం శిల్పకళావేదికలో ఓ కార్యక్రమం నిర్వహించి ఆస్కార్ వీరుల్ని గౌరవించుకోవాలని టాలీవుడ్ నిర్ణయించింది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఈ సన్మాన సభ జరగబోతోంది. ఈ కార్యక్రమానికి పలువులు హీరోలు, రచయితలు, సంగీత దర్శకులు, దర్శకులు, నిర్మాతలు హాజరవుతారని ఛాంబర్ ఆఫ్ కామర్స్ తెలిపింది. అయితే.. ఎవరెవరు వస్తారో ఇంకా ఓ నిర్దారణకు రాలేదు. టాలీవుడ్ అగ్ర హీరోలు చిరు, వెంకీ, నాగ్, మహేశ్, పవన్.. ఇలాంటివాళ్లు వస్తేనే ఈ కార్యక్రమానికి ఓ కళ. వీళ్లలో ఎవరైనా వస్తారా? రారా? అనే విషయంలో స్పష్టత లేదు.కేవలం నిర్మాతలు, దర్శకులూ హాజరై ‘మ..మ’ అనిపించుకొంటే ఈ సన్మాన కార్యక్రమానికి కళ తప్పినట్టే. నిజానికి ప్రభుత్వాలు పూనుకొని చేయాల్సిన ఈవెంట్ ఇది. ఆస్కార్ అనేది చిన్న విషయం కాదు. భారతీయులకు ఎప్పటికీ తీరని కలేమో? అనుకొన్న ఘనత ఇది. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలు పూనుకొని, ఓ ఈవెంట్ లాంటినిది నిర్వహిస్తే బాగుండేది. క్రీడల్లో పతకాలు తెచ్చినవాళ్లకు వెంటనే ప్రభుత్వాలు నజరానాలు ప్రకటిస్తాయి. ఆస్కార్ వచ్చి ఇన్ని రోజులైనా.. అలాంటి ఊసే లేదు. కనీసం చిత్రసీమ అయినా తన బాధ్యత నెరవేర్చుకొంటోంది. ఇక ప్రభుత్వాలేం చేస్తాయో చూడాలి.