ఖుషీ సినిమా తర్వాత పవన్ కల్యాణ్ అసలు ఇండియా నుంచి వెళ్లిపోయి న్యూజిలాండ్‌లో సెటిల్ అవ్వాలనుకున్నారట. ఇమ్మిగ్రేషన్ పత్రాలన్నీ రెడీ చేసుకున్నా చావైనా, బతుకైనా మన దేశంలోనే అని డిసైడై ఆగిపోయారు. ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ వరంగల్‌లోని నిట్ కళాశాల వేడుకల్లో పాల్గొని అక్కడ విద్యార్థులకు తెలిపారు. విద్యార్థులకు స్ఫూర్తినిచ్చేలా ప్రసంగించారు. మనం సిక్స్ ప్యాక్ చేసి కండలు పెంచుతాం కానీ అంతకంటే ముఖ్యంగా గుండె బలాన్ని పెంచుకోవాలని పవన్ విద్యార్థులకు సలహా ఇచ్చారు. జీవితంలో ఏది నేర్చుకోవాలంటే అది నేర్చుకోవచ్చు. కానీ ప్రతిదానికి తగినంత సమయం ఇవ్వాల్సిన అవసరముందని పవన్ గుర్తు చేశారు.
ఏదైనా అంశంలో మాస్టర్ అవ్వాలంటే కనీసం పదివేల గంటలు వెచ్చించాలన్నారు. అలాగే భయం లేకుండా ఎలా మాట్లాడాలి? తప్పు జరిగితే ఎలా ఎదుర్కోవాలనే విషయాలపై తాను చాలా ప్రాక్టీస్ చేసినట్లు చెప్పారు. మన కళ్ల ముందు ఏదైనా సంఘటన లేదా తప్పు జరిగినపుడు వెంటనే స్పందించి బాధ్యత తీసుకోవాలన్నారు . ‘తొలిప్రేమ’ సినిమా షూటింగ్ టైమ్‌లో కళ్ల ముందే ఒక బైకర్.. ఫోర్ వీలర్‌ను ఢీకొట్టి కింద పడిపోయాడు. ఒంటి నిండా రక్తం కారుతోంది. అక్కడున్న వారితో పాటు షూటింగ్ సిబ్బంది చూసినా ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ధైర్యం చేయలేదన్నారు. అప్పుడు వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్ ధరించి షాట్‌కు రెడీ అవుతున్నాను. కానీ ఈ సీన్ చూడగానే వెంటనే అతన్ని నా చేతులతో పైకి లేపి కారులో వేసి హాస్పిటల్‌కు తీసుకెళ్లమన్నాను. దీనివల్ల షూటింగ్ ఆగింది. కానీ అక్కడ ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడటమే ముఖ్యం అని పవన్ గుర్తు చేసుకున్నారు.
అన్నిసార్లు విజయాన్ని అందుకునే క్రమంలో మన చుట్టూ జరిగే సంఘటనలను చూసీచూడనట్లుగా ఓవర్ లుక్ చేస్తామన్నారు పవన్. అయితే సక్సెస్ ఎక్కడికీ వెళ్లదని.. ఒకరి ప్రాణం కాపాడటమే ముఖ్యమనే సిద్ధాంతాన్ని తాను ఫాలో అవుతానని చెప్పారు. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినపుడు ధైర్యంగా ముందడుగు వేయడం వల్లనే మానవత్వం బతుకుతుందన్నారు. బాల్యంలో లియోనార్డ్ డావెన్సీ తనకి రోల్ మోడల్ అని పవన్ స్టూడెంట్స్‌కు తెలిపారు. ఇంటర్లో తన మిత్రులు పరీక్షలకు స్లిప్‌లు తీసుకెళ్లినా ఫెయిల్ అయిన సరే కాపీ కొట్టకూడదనే భావనతో… నిజాయితీగా పరీక్షలు రాసి ఇంటర్ ఫెయిల్ అయినట్లు పవన్ చెప్పారు. పరాజయాలు ఎదుర్కొంటేనే విజయాలు సాధ్యమవుతాయన్నారు. ఈ రోజు ఓడిపోవచ్చు కానీ రేపు విజయం ఖచ్చితంగా సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
పవన్ స్పీచ్ వినేందుకు విద్యార్థులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వారందరిలో స్ఫూర్తి నింపేలా పవన్ మాట్లాడారు.