Ravanasura Movie Review
తెలుగు360 రేటింగ్ : 2.25/5
ధమాకా, వాల్తేరు వీరయ్య విజయాలు రవితేజకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. ఈ రెండూ పక్కా మాస్ కమర్షియల్ సినిమాలే. అయితే ఇప్పుడు వీటికి పూర్తి భిన్నంగా ‘రావణాసుర’ అనే థ్రిల్లర్ కథతో వచ్చాడు. ప్రమోషన్స్ లో ఈ సినిమా గురించి ఏ విషయాన్నీ రివిల్ చేయలేదు. అన్నీ థియేటర్లో చూడాల్సిందేనని టీమ్ మొత్తం ముక్తకంఠంతో చెప్పింది. రవితేజ లాంటి మాస్ హీరో ఒక థ్రిల్లర్ చేస్తున్నారంటే సహజంగానే ఒక ఆసక్తి ఏర్పడుతుంది. మరి రవితేజ అంత బలంగా నమ్మిన కథ ప్రేక్షకులకు థ్రిల్ ఇచ్చిందా ? రవితేజకు హ్యాట్రిక్ విజయం దక్కిందా?
రవీంద్ర (రవితేజ )జూనియర్ లాయర్. కనకమహాలక్ష్మి (ఫారియా అబ్దుల్లా ) దగ్గర జూనియర్‌గా పని చేస్తుంటాడు. హారిక (మేఘ ఆకాష్ ) తన తండ్రి(సంపత్ రాజ్) కేసు నిమిత్తం కనక మహాలక్ష్మిని కలవడానికి వస్తుంది. హారిక తండ్రి సంపత్ రాజ్ ఓ పెద్ద ఫార్మా కంపెనీకి ఓనర్. అనుకోకుండా ఓ హత్య కేసులో ఇరుక్కుంటాడు. తనే హత్య చేసాడని అన్ని ఆధారాలు ఉంటాయి. దీంతో కనకమహాలక్ష్మి కేసుని టేకాఫ్ చేయదు. ఐతే హారికని తొలి చూపులోనే ఇష్టపడిన రవీంద్ర ఎలాగైనా ఈ కేసు టేకాప్ చేసి హారిక ప్రేమ పొందాలి అనుకుంటాడు. మరి ఈ కేసుని రవీంద్ర గెలిచాడా ? అసలు సంపత్ ని ఇందులో ఇరికించింది ఎవరు ? ఒకే ప్యాట్రాన్ లో జరిగిన మరికొన్ని హత్యలకు ఈ కేసు కి ఏమిటి సంబంధం ? ఈ కేసులో ఎలాంటి నిజాలు బయటికి వచ్చాయి ? అనేది మిగతా కథ.
థ్రిల్లర్ సినిమాలకి ఉండాల్సిన ప్రధాన లక్షణం.. ప్రేక్షకుల దృష్టిని తిప్పనివ్వకుండా హోల్డ్ చేయడం. కథలోని మలపులు, విచారణ, ఎత్తుగడలు.. ఇలా అన్నీ ప్రేక్షకులకు ఊహకు అందకుండా సాగుతూ సర్ ప్రైజ్ ఇచ్చేలా ఉండాలి. అప్పుడే ఒక మంచి థ్రిల్లర్ చూసామనే అనుభూతి ప్రేక్షకులకు కలుగుతుంది. అయితే ఈ అనుభూతిని ఇవ్వడం లో `రావణాసుర` వెనకబడిపోయింది. ఒక రివేంజ్ కథని థ్రిల్లర్ లా మార్చే ప్రయత్నం చేసాడు దర్శకుడు సుధీర్ వర్మ. ఐతే ఈ ప్రయత్నం.. ఇటు రివెంజ్ అటు థ్రిల్ రెండూ మిస్ అయ్యాయి.
ఓ మర్డర్ సీన్ తో కథ మొదలౌతుంది. తర్వాత ఏమౌతుందో అని ఆసక్తి గా ఎదురు చూస్తున్న ప్రేక్షకుడికి.. ”ఇది రవితేజ సినిమా అని” గుర్తు చేస్తూ అవసరం లేని ఫైటు, సీరియస్ నెస్ ని దెబ్బ తీసే ఒక పాట వచ్చి పడిపోతాయి. మళ్ళీ ఇది థ్రిల్లర్ అని గుర్తు చేస్తూ విచారణ అధికారిగా జయరాంని దించుతారు. కేసు విచారణ లోకి జయరాం వచ్చిన తర్వాత హంతకుడికి కష్టాలు ఎదురౌతాయని భావిస్తే మాత్రం పొరపాటే. ఆయన వచ్చిన తర్వాత హంతకుడి పని ఇంకా సులువైతుంది. దొంగ చాటుగా చేసే హత్యలు ఇక నేరుగా చేయడం మొదలుపెతాడు హంతకుడు. మరి పోలీస్ అధికారిగా జయరాం ఎందుకు ఏం చేయలేకపోయాడు ? అంటే.. దీనికి దర్శకుడు, రచయిత కలసి ఇచ్చుకున్న లాజిక్.. హంతకుడి కళ్ళల్లో ఓ మెరపు చూశాడట. అది దేనికీ, ఎవరికీ భయపడని మెరుపట. ఈ మాట విన్న తర్వాత బిక్క మొహం వేసి అలా చూస్తూ వుండిపోవం తప్పితే ప్రేక్షకుడికి మరో ఆప్షన్ లేదు. ఇది థ్రిల్లర్. కథ గురించి, పాత్రల గురించి.. సినిమా ఇంకా చూడని వారికి చెప్పొద్దూ అన్నారు కాబట్టి .. లోతుగా వెళ్ళడం లేదు కానీ.. ఇందులో ఏ పాత్ర కూడా సహజంగా నడవలేదు. కొన్ని పాత్రలకు సరైన ముగింపే వుండదు.
ఫస్ట్ హాఫ్ లోనే వున్న చిన్న సస్పెన్స్ రివిల్ చేశారు. సెకండ్ హాఫ్ లో ఏదైనా కొత్త పాయింట్ తో కథ టర్న్ అవుతుందని ఆశపెట్టుకుంటే అక్కడా ఆశా భంగమే. అదే పాయింట్ లాగిలాగి చూపించిన సీన్లే మళ్ళీ మళ్ళీ చూపించి చివరికి.. ఇదంతా ఇందుకోసం జరిగిందని ఓ బీసి కాలం నాటి రివెంజ్ టెంప్లెట్ ని చూపించారు. అది చూసిన తర్వాత ఈ పాటి రివెంజ్ కి ఇంత సెటప్ అవసరమా? అనిపిస్తుంది. అసలైన ట్విస్టుని ఎంత సేపు హోల్డ్ చేశారన్నది ఇలాంటి థ్రిల్లర్లకు ఆయువు పట్టు. ఈ ట్విస్టుని హోల్డ్ చేసే మాట అటుంచితే.. అసలు ట్విస్టేంటో తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రేక్షకుడికే లేకుండా చేశారు. కథకి ప్రాణమైన ట్విస్ట్ ని రివీల్ చేసే పద్ధతి కూడా ప్రభావంతంగా ఉండదు.
రవితేజ ఎప్పటిలానే హుషారుగా కనిపించారు. ఈ కథకు అవసరం లేకపోయినా ఆదితో కలసి జబర్దస్త్ పంచులు కొన్ని వేశారు. యాక్షన్ సీన్స్ ఎప్పటిలానే ఎనర్జిటిక్ గా చేశారు. ఇందులో దాదాపు ఐదు మంది హీరోయిన్స్ వున్నారు. ఫారియా మంచి నటి. కానీ ఆమె పాత్రని పెద్దగా వాడుకోలేదు. మేఘా ఆకాష్ పాత్ర కీలకమైననదే. అను ఇమ్మాన్యుల్ రెండు సీన్స్ లో కనిపిస్తుంది. ఆమె పేరు కూడా రిజిస్టర్ కాదు. పొరపాటున సినిమా చూస్తూ సెల్ ఫోన్స్‌లో కాసేపు నిమగ్నమైపోతే.. అలాంటి పాత్ర ఉందని కూడా ప్రేక్షకుడికి తెలీదు. బహుశా ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా చూసి ఆమెను ఈ పాత్రకి ఎంపిక చేసి వుంటారు. పూజిత, దక్ష పాత్రలు ఓకే అనిపిస్తాయి. సుశాంత్ పాత్ర అతనకి కొత్తగా వుంది. జయరాం పాత్రని ఇంకా బలంగా రాయాల్సింది. నాలుగు జోకులు వేసి మాయమైపోయే పాత్రలో కనిపించాడు ఆది. శ్రీరామ్, రావు రమేష్, సంపత్ రాజ్..పరిధిమేర కనిపించారు.
రావణాసుర లాంటి సినిమాకి పాటలు అనవసరం కానీ మూడు పాటలు ఇరికించేశారు. వెయిన్నొక్క జిల్లాల వరకూ వింటున్నాను నీ కీర్తినే.. పాటని రీమిక్స్ చేశారు కానీ, సందర్భ రహితంగా వచ్చి పడిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. హర్షవర్ధన్ ఇచ్చిన నేపధ్య సంగీతం ఆకట్టుకుంటుంది. అయితే సన్నివేశాల్లో బలం లేకపోవడం వలన అదీ విడిగా వినిపిస్తుంది. కెమెరాపనితనం బావుంది. ఎడిటర్ పాటలు వద్దు అని బలంగా చెప్పాల్సింది. గుర్తుపెట్టుకునే మాటలు లేవు. సుధీర్ వర్మకి ఒక పెక్యులర్ స్టయిల్ వుంటుంది. అయితే ఆయన మార్క్ ఇందులో కనిపించలేదు. అటు థ్రిల్లర్.. ఇటు రివెంజ్ రెండిట్లో దేనికి న్యాయం చేయలేకపోయాడు రావణాసుర.
తెలుగు360 రేటింగ్ : 2.25/5