హైదరాబాద్ పర్యటనకు వస్తున్న మోదీ .. బీఆర్ఎస్ పై ఎలాంటి వ్యూహం అమలు చేస్తారన్నది కీలకంగా మారింది. గతంలో ఆయన భారీ విమర్శలు చేసిన సందర్భాలు లేవు. గతంలో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభంలో పరోక్షంగా కొన్ని విమర్శలు చేశారు కానీ ఘాటు రేంజ్‌కు ఎప్పుడూ వెళ్లలేదు. గతంలో మునుగోడులో ఉప ఎన్నికలు ఉన్నా.. విమర్శలకు మోదీ దూరంగా ఉన్నారు. అప్పట్లో మోదీ విమర్శల దాడి చేస్తారని బీఆర్ఎస్ నేతలు భావించారు. ముందే కేసీఆర్ సభను ఏర్పాటు చేసి తీవ్ర విమర్శలు చేశారు. కానీ మోదీ వారి అంచనాలను తలకిందులు చేశారు.
కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. బీజేపీని బీఆర్ఎస్ దారుణంగా టార్గెట్ చేస్తోంది. మోదీ, అమిత్ షా వచ్చినప్పుడు అవమానకరంగా ఫ్లెక్సీలతోనూ యుద్ధం చేస్తున్నారు. ప్రతిపక్ష కూటమికి తనను చైర్మన్‌ను చేస్తే లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి ఖర్చంతా తానే భరిస్తానని సీఎం కేసీఆర్ ఆఫర్ ఇచ్చారని జాతీయ స్థాయిలో ప్రచారం జరిగింది. మోదీ సర్కారును కూల్చడమే ధ్యేయంగా కేసీఆర్ పావులు కదుపుతున్నారని బీజేపీ నేతలూ విమర్శలు గుప్పిస్తున్నారు.
అలాగే, రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసిన తర్వాత కేంద్రంలో ప్రతిపక్షాలన్నీ ఒక్కటవుతున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలకు బీఆర్ఎస్ నేతలూ హాజరవుతున్నారు. దాంతో, తన సమాధి తవ్వడానికి అవినీతిపరులంతా ఏకమవుతున్నారని మోదీ కూడా విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో మోదీ తెలంగాణ పర్యటనలో కేసీఆర్ ను విమర్శించకుండా తమ ప్రభుత్వ విజయాలను చెప్పుకుని వెళ్లిపోతే… బీజేపీ నేతలు కూడా డీలా పడే అవకాశం ఉంది. అయితే జరుగుతోంది బీజేపీ కార్యక్రమం కాదని అధికారిక కార్యక్రమం అని కొంత మంది గుర్తు చేస్తున్నారు.