ఏపీలో రెండు రోజులుగా ఐఏఎస్, ఐపీఎస్‌లను పెద్ద ఎత్తున బదిలీ చేస్తున్నారు. ముందస్తు ఎన్నికల ప్రచారం.. వచ్చే ఎన్నికలకు అనుకూలమైన అధికారుల నియామకం అని ఎక్కువ మంది భావిస్తూండటంతో పోస్టింగ్‌లు పొందుతున్న వారికి ఇరకాటంగా మారింది. తాము ప్రభుత్వానికి సన్నిహితులమని ఇతర పార్టీలు నమ్మితే తమ కెరీర్‌కు గ్రహణం పడుతుందని వారు ఆందోళన చెందుతున్నారు. కీలక పోస్టింగ్‌లు పొందిన వారిలో చాలా మంది.. ప్రభుత్వం చెప్పినట్లుగా చేయాల్సి వస్తుందని.. అలా చేయడం అంటే చిక్కులు తెచ్చి పెట్టుకోవడమేనన్న ఆందోళనలో ఉన్నారు
ఈ ప్రభుత్వ పెద్దలు ఏదీ నిబంధనలకు అనుగుణంగా చేయమని చెప్పరని స్వార్థ ప్రయోజనాల కోసం నిబంధనలను ఉల్లంఘిచి నిర్ణయాలు తీసుకోవాలని ఒత్తిడి తెస్తారని ఇప్పటి వరకూ ఎదురైన అనుభవాలతో సివిల్ సర్వీస్ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల కోసం చేసే సన్నాహాల్లో.. ఎన్నికల సమయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించాల్సిన పరిస్థితి వస్తే తాము టార్గెట్ అయిపోతామని అంటున్నారు. నిజానికి ఏపీ ప్రభుత్వం తాము చెప్పినట్లుగా చేసే అతి కొద్ది మంది సివిల్ సర్వీస్ అధికారులకే ప్రాధాన్యం ఇచ్చి చేయాలనుకున్నవన్నీ వారితోనే చేయిస్తుంది. అలా కొంత మంది తీవ్ర వివాదాస్పదం అయ్యారు. వారి భవిష్యత్ ఏలా ఉంటుందన్నది … అధికార వర్గాల్లోనే విస్తృత చర్చ జరుగుతోంది.
ఇటీవలి కాలంలో కొంత మంది అధికారులు తాము నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరిస్తామని బదిలీ చేసినా పోస్టింగ్ ఇవ్వకపోయినా పర్వాలేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇది ప్రభుత్వానికి కూడా ఇబ్బందికరంగా మారింది. గతంలో కలెక్టర్ పోస్టుల కోసం లాబీయింగ్ జరిగేది. ఈ ప్రభుత్వంలో కలెక్టర్ పోస్టు కోసం ప్రయత్నించే ఐఏఎస్‌లు కూడా తగ్గిపోయారు. అలాగే ఎస్పీ పోస్టులకు కూడా. సిఫార్సులు తగ్గిపోయాయి. ఇప్పుడు పోస్టులు పొందిన వారు కూడా.. తాము ప్రభుత్వానికి సన్నిహితులమే ముద్ర పడుతుందేమోనని ఆందోళన చెందుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.