పోలీస్ స్టోరీలంటే… మనోళ్లకు మక్కువ కాస్త ఎక్కువే. క్లాసూ, మాసూ అనే తేడా లేకుండా.. హోల్ సేల్ గా అన్ని వర్గాల్నీ ఆకట్టుకొనే దమ్ము… పోలీస్ కథలకు ఉంది. ఖాకీ కథలెప్పుడూ ఎవర్ గ్రీనే. స్టార్ హీరోలు… మీడియం రేంజ్ కథానాయకులు అనే తేడా లేదు. ఎవరైనా సరే, పోలీస్ కథలకు ఫిదా అయిపోవాల్సిందే. అందుకే ప్రతీ సీజన్లోనూ ఓ పోలీస్ కథ తయారవుతుంటుంది. యాక్షన్, కామెడీ, థ్రిల్లర్, ఎమోషన్, సస్పెన్స్ ఏదైనా సరే, తనలో ఇముడ్చుకొనే శక్తి పోలీస్ స్టోరీలకు ఉంది. అందుకే… ఇవి హాట్ కేకులు. టాలీవుడ్ లో ప్రస్తుతం పోలీసులు పడ్డారు. కొంతమంది హీరోలు ఖాకీ డ్రస్సుల్లో కాక పుట్టించడానికి రెడీ అయ్యారు. ఓ రకంగా ఇది పోలీస్ స్టోరీల సీజన్.
చిరు, బాలయ్య, వెంకీ, నాగ్, ఎన్టీఆర్, మహేష్, పవన్… ఇలా ఏ ఒక్క హీరో వదలని సబ్జెక్ట్ పోలీస్ స్టోరీ. ఒకొక్కరూ రెండు మూడుసార్లు ఖాకీ యూనిఫామ్ తొడిగారు. హిట్లు కొట్టారు. పోలీస్ కథలన్నీ పిప్పి పిప్పి చేసి వదిలారు. అయినా వాటి రుచి పోలేదు. ఇప్పటికీ ఈ తరహా కథలు వస్తూనే ఉన్నాయి. పవన్ కల్యాణ్‌కి పోలీస్ కథలు బాగానే అచ్చొచ్చాయి, ‘గబ్బర్ సింగ్’లో పిస్తోల్ పట్టిన పవన్.. ఖాకీ డ్రస్సు క్రేజేంటో చెప్పేశాడు. ఆ సినిమా పవన్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ‘భీమ్లా నాయక్’ కోసం మరోసారి యూనిఫామ్ వేసుకొన్నాడు. ఇదీ హిట్టే. ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’లోనూ పవన్ పోలీసే. పవన్ అభిమానులకు హరీష్ శంకర్ తయారు చేస్తున్న మాస్ మసాలా విందు ఇది. క్లాప్ కొట్టుకోవడంతోనే ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.
వెంకటేష్ పోలీస్ పాత్రలు బాగానే చేశాడు. సూర్య ఐపీఎస్, సూపర్ పోలీస్ చిత్రాల్లో పోలీస్ గా మెప్పించాడు వెంకటేష్. ఇప్పుడు ‘సైంధవ’లోనూ వెంకీ అలాంటి పాత్రే పోషిస్తున్నాడు. క్రైమ్ సినిమాలు తీసి హిట్టు కొట్టడంలో శైలేష్ కొలను తన మార్క్ చూపించాడు. హిట్ ఫ్రాంచైజీలో హీరోలంతా… పోలీసులే. ఈసారి కూడా అలాంటి కథే ఎంచుకొన్నాడు. బయటకు చెప్పడం లేదు కానీ.. `సైంధవ్`లో వెంకీది పోలీస్పాత్రే. అన్నట్టు… నాని కూడా పోలీస్ అవతారం ఎత్తుతున్నాడు. ‘హిట్’ ఫ్రాంచైజీకి నిర్మాణ కర్త… నానినే. ‘హిట్ 1’లో విశ్వక్ సేన్, ‘హిట్ 2’లో అడవిశేష్ నటించారు. ‘హిట్ 3’లో మాత్రం నానినే కనిపించనున్నాడు. నాని పోలీస్ వేషం వేయడం ఇదే తొలిసారి. మరి ఈ పాత్రలో ఎలా ఒదిగిపోతాడో చూడాలి.
కామెడీ పోలీస్ గా నరేష్ చాలాసార్లు కితకితలు పెట్టాడు. కితకితలు, బ్లేడ్ బాబ్జీలలో నరేష్ పోలీసే. అయితే ఇప్పుడు సీరియస్, సిన్సియర్ ఆఫీసర్ గా మారిపోయాడు. నరేష్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఉగ్రం’. ఇందులో నరేష్ పోలీస్‌గా కనిపించనున్నాడు. ‘నాంది’తో నరేష్ కొత్త జోనర్ బాట పట్టాడు. సీరియస్ కథల్లోనూ మెప్పించగలనని నిరూపించుకొన్నాడు. ‘ఉగ్రం’ కూడా ఇలాంటి కథే. ఓ నిజాయతీగల పోలీస్ ఆఫీసర్ జీవితంలో ఎదురయ్యే సవాళ్లని తెరపై చూపిస్తున్నారు. నరేష్ గెటప్, ఆ సెటప్ అన్నీ కొత్తగా కనిపిస్తున్నాయి. ‘వారియర్లో’ రామ్ తొలిసారి పోలీస్ గా కనిపించాడు. అయితే ఆ సినిమా సరిగా ఆడలేదు. యువ హీరో… కిరణ్ అబ్బవరం కూడా ‘మీటర్’తో పోలీస్ అయిపోయాడు. విశ్వక్సేన్, అడవిశేష్… ఈ పాత్రల్ని అలవోకగా పోషించగలమని నిరూపించేశారు. ఇక మీదట కొత్త దర్శకులు పోలీస్ కథలు రాసుకొనేటప్పుడు వీళ్లని తప్పకుండా పరిగణలోనికి తీసుకోవాల్సిందే. ప్రభాస్ ని పోలీస్ పాత్రలో చూడాలని అభిమానులు ఎప్పటి నుంచో ఆశిస్తున్నారు. ఆ ఒక్కటీ తీరిపోతే… హీరోలంతా పోలీస్ గెటప్పుల్లో ఓ రౌండ్ వేసేసినట్టే అవుతుంది.