ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును బీజేపీ హైకమాండ్ ఢిల్లీకి పిలిచింది. పార్టీ ముఖ్య నేతలతో ఆయన సమావేశాలు నిర్వహించనున్నారు. మూడు రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే ఉంటారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరే కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయనకు ఆహ్వానం అందలేదు కానీ.. ఇప్పుడు ప్రత్యేకంగా పిలవడంపై మాత్రం బీజేపీలోనే రకరకాల చర్చలు జరుగుతున్నాయి.
ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఢిల్లీ వెళ్లారు. పార్టీ ముఖ్య నేతలతో చర్చలు జరిపారు.ఏ చర్చలు జరిపారన్నదానిపై స్పష్టత లేదు కానీ..పొత్తుల గురించి కూడా మాట్లాడామని తర్వాత అమరావతిలో మీడియా సమావేశం పెట్టినప్పుడు నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. ఏపీలో వైసీని ఓడించడమే లక్ష్యమని పవన్ ఢిల్లీలోనే ప్రకటించారు. తాము టీడీపీతో కలిసి వెళ్లడం ఖాయమని ఏపీలో రాజకీయ పరిస్థితులపై అవగాహన ఉందికాబట్టి బీజేపీ కూడా కలసి వస్తే బెటరని జనసేన నుంచి బీజేపీకి సందేశాలు వెళ్లాయని చెబుతున్నారు. అది ఎంత వరకు నిజమో కానీ.. బీజేపీలో ఉన్న కొంత మంది టీడీపీతో పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం అయితే జోరుగా సాగుతోంది.
సోము వీర్రాజు పర్యటనలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ వ్యూహం ఏమిటో అన్నది క్లారిటీకి వచ్చే అవకాశంఉంది. ఒంటరిగా పోటీ చేస్తే ఒక్క చోట కూడా డిపాజిట్లు రావనే విషయంలో ఎవరికీ డౌట్ లేదు. ఇప్పుడు ఎమ్మెల్సీలు కూడా ఎవరూ లేరు. టీడీపీతో పొత్తు ఉన్నప్పుడు రెండు చోట్లా బీజేపీ ప్రాతినిధ్యం ఉంది. ఇప్పుడు పొత్తు లేకపోతే.. అలాంటిదేమీ ఉండదు. వైసీపీ అధికారికంగా పొత్తులు పెట్టుకోదు కాబట్టి.. బీజేపీకి మరో ఆప్షన్ లేదంటున్నారు. సోము వీర్రాజు ఢిల్లీ పర్యటనలో దీనిపైస్పష్టత వచ్చే చాన్స్ ఉందంటున్నారు.