ఏపీ ప్రభుత్వం ఇప్పుడు చాలా వేగంగా పని చేస్తోంది. పని చేయకుండా చేస్తున్నట్లుగా కవరింగ్ చేసుకోవడానికి ఫుల్ పేజీ ప్రకటనలు ఉంటాయి. కానీ.. చేసే పనిని మాత్రం చెప్పుకోవడంలేదు. ఇంతకీ ఆ పనేమిటంటే భూయజ్ఞం. లక్షల ఎకరాలు అప్పనంగా చేతులు మరిపోతున్నాయి. అవన్నీ ప్రభుత్వ భూములే. ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు రిజిస్ట్రేషన్ల చట్టంలో కొన్ని సెక్షన్లు ఉన్నాయి. వాటికింద భూములపై లావాదేవీలు, రిజిస్ట్రేషన్లు చెల్లవు. ఇలా ప్రభుత్వ భూముల లక్షల ఎకరాలు ఉన్నాయి. ఎక్కువగా 22 ఏ సెక్షన్ కింద ఈ భూములు ఉన్నాయి.
కానీ ఈ ప్రభుత్వం ఇప్పుడు భూములన్నింటిన ీక్లియర్ చేస్తోంది. నిషిద్ధ జాబితా నుంచి లక్షల ఎకరాలను తప్పిస్తోంది. ఇప్పటి వరకూ రెండు లక్షల 16వేల ఎకరాల భూముల్ని నిషిద్ధ జాబితా నుంచి తొలగించారు. అంటే వాటిని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.. లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. ఎవరు చేస్తాంటే.. ప్రైవేటు వ్యక్తులే. మరి ప్రభుత్వ భూమి అనే కదా నిషిద్ధ జాబితాలో చేర్చింది అంటే.. అదంతా తర్వాత విషయం.
నిబంధనల ప్రకారం 22 ఏ భూముల్ని నిషిద్ధ జాబితా నుంచి తీయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. రిటైర్డ్ జిల్లా జడ్జీతో కూడిన కమిటీ ఉండాలని హైకోర్టు ఆదేశించింది. కానీ ఇప్పటివరకు అమలు చేయలేదు. కమిటీ లేకుండానే ఇప్పటి వరకు 2లక్షల ఎకరాలను ప్రభుత్వం బయటకు తీసింది. ఇది హై కోర్టు ఆదేశాలు, మార్గదర్శకాలకు పూర్తి విరుద్ధం.. అయినా కోర్టుల్ని పట్టించుకోవడం ఎప్పుడో మానేశారు. ఇప్పుడు భూముల స్వాహాకు వాడుకుంటున్నారు. ఎన్నికల్లో గెలిపించారంటే… ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులన్నీ తమకు రాసిచ్చినట్లుగా భావించే పాలకులు … అంతకు మించి ఇంకేం చేయబోతున్నారో ముందు ముందు తెలియనుంది.