80 కిలోమీటర్ల దూరానికి మూడు గంటలు పట్టింది ఇవేం రోడ్లురా బాబోయ్ అని.. బీజేపీ ఎంపీ సోయం బాపూరావు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆయన తెలంగాణ ఎంపీనే కానీ.. ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయం మాత్రం ఏపీ రోడ్లపై . ఎందుకంటే ఆయనకు అనుభవం అయింది మరి. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో న జాతి సురక్ష మంచ్ ర్యాలీలో పాల్గొనేందుకు ఆయన వచ్చారు. ఈ సందర్భంగా అసలు విషయంతో పాటు ఏపీకి వచ్చేందుకు తాను పడిన పాట్ల గురించి వివరించారు.
పాడేరుకు వచ్చే రోడ్లు నరకాన్ని తలపిస్తున్నాయన్నారు. 80 కిలోమీటర్ల ప్రయాణానికి మూడు గంటల సమయం పట్టిందన్నారు. పాడేరువాసులు విశాఖ ఎలా వెళ్తున్నారో అర్థం కావడం లేదని, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా… జిల్లా హెడ్ క్వార్టర్లు అభివృద్ధి చెందకపోవడం దారుణమన్నారు. తెలంగాణ వెనుకబడిందని అనుకున్నానని, కానీ ఏపీలో కూడా అదే పరిస్థితి ఉందని సోయం బాపూరావు అన్నారు. పాడేరులో ఇప్పటికీ చదువుకోని యువత ఉన్నారంటే రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతోందన్నారు.
ఏపీకి కొత్తగా వచ్చే వారందరికీ ఇదే అభిప్రాయం ఉంటుంది. జాతీయ రహదారుల మీదుగా ఏపీలోకి వచ్చి . వెళ్లిపోతే వారికి నొప్పి తెలియదు. పొరపాటున ఆర్ అండ్ బీ రోడ్లపై జర్నీ చేయాలంటే మాత్రం.. అలాంటి వారికి నరకం కనిపిస్తుంది. గతంలో చినజీయర్ స్వామి కూడా ఈ రోడ్ల నరకాన్ని తట్టుకోలేకపోయారు. ఇప్పుడు బీజేపీ ఎంపీ వంతు. మొత్తంగా ఏపీలో పరిస్థితి ఎలా ఉంటుందో.. ఇలాంటి వీఐపీలు వచ్చినప్పుడు బయట ప్రపంచానికి తెలుస్తుంది. ఏపీలో ఉన్న వారికి ఇదేమీ పెద్ద విశేషం అనిపించదు.. ఎందుకంటే… ఏపీ ప్రజలకు అలవాటు అయిపోయింది మరి.