కోడికత్తి కేసును కూడా తేల్చడానికి సీఎం జగన్కు మనసొప్పడం లేదు. ఎన్ఐఏ కోర్టులో హియరింగ్ ప్రారంభమైన తర్వాత వీలైనన్ని రోజులు తప్పించున్న ఆయన ఇప్పుడు మరోసారి అలాంటి ఎత్తుగడే వేశారు. తాను కోర్టుకొస్తే ట్రాఫిక్ ఇబ్బందులొస్తాయే.. మీటనొక్కే కార్యక్రమాలకు ఆటంకాలు ఏర్పడతాయని .. అందుకే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించాలని ఓ పిటిషన్ వేశారు. అంతే కాదు.. ఈ కేసు విషయంలో మరింత లోతుగా విచారణ చేయాలని మరో పిటిషన్ దాఖలు చేశారు.
జగన్ పిటిషన్ చూసి న్యాయవర్గాలు సైతం విస్మయ పడుతున్నాయి. మరింత లోతుగా అంటే ఏంటన్న సందేహాలు వస్తున్నాయి. జగన్ ఒత్తిడి మేరకే కేంద్రం… కోడికత్తి కేసును ఎన్ఐఏకు ఇచ్చింది. కీలక విషయాలను వెల్లడించింది. అయితే ఇప్పుడు విచారణ దగ్గరకు వచ్చే సరికి జగన్ .. యూటర్న్ తీసుకుంటున్నారు. ఎన్ఐఏ విచారణపై నమ్మకం లేదన్నట్లుగా మాట్లాడుతూ.. ఇంకా లోతుగా విచారణ చేయాలని పిటిషన్ వేశారు. అంటే.. కేసు విచారణను ఇప్పుడల్లా తేల్చవద్దని మరింత ఆలస్యం చేయాలని ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోందంటున్నారు.
కోడికత్తి శీను ఇప్పటికే నాలుగేళ్లుగా జైల్లో మగ్గుతున్నారు. ఆయన తల్లిదండ్రులు మానసిక వేదనకు గురవుతున్నారు. దళితుడైన డ్రైవర్ ను చంపి జైలుకెళ్లిన వైసీపీ ఎమ్మెల్సీకి కూడా బెయిలొచ్చింది. కానీ కోడికత్తి శీను మాత్రం ఇంకా జైల్లో మగ్గుతున్నారు. ఇంకా లోతైన విచారణ పేరుతో ఆలస్యం చేయాలని జగన్ అనుకోవడం విస్మయ పరుస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇప్పుడు ఎన్ఐఏ చేసిన విచారణతో గత ఎన్నికలకు ముందు తాము ఆడిన నాటకం బయటపడుతుందని అనుకుంటున్నారేమో కానీ… సీఎం జగన్ యూటర్న్… అనేక అనుమానాలకు దారి తీసేలా కనిపిస్తోంది.