వైఎస్ వివేకానందరెడ్డి కేసులో అవినాష్ రెడ్డి వ్యవహారం రాను రాను వివాదాస్పదంగా మారుతోంది. సుప్రీంకోర్టు సీబీఐ విచారణాధికారిని మార్చడంతో అరెస్టు నుంచి తప్పించుకున్న ఆయన ఇప్పుడు తాను సీబీఐ విచారణలో ఏం చెప్పారోనని కంగారు పడుతున్నారు. ఏమైనా చెప్పకూడనివి చెప్పేశారని డౌట్ వచ్చిందేమో కానీ… తన విచారణ ఆడియో, వీడియోలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. మార్చి 14వ తేదీన సీబీఐ అధికారులు తనను ప్రశ్నించారు. వాటిని ఆడియో, వీడియో తీశారని.. అవి తనకు ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేశారు.
ఈ పిటిషన్పై విచారణ జరగాల్సింది. ఓ హైప్రోఫైల్ హత్య కేసులో నిందితులు ఇంత బహిరంగంగా న్యాయవ్యవస్థతో ఆటలాడుకూంటూ… అర్థం లేని పిటిషన్లు వేయడం.. వాటిలో కొన్ని సార్లు ఊరట పొందుతూండటం చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది. చివరికి విచారణాధికారిని కూడా మార్పించుకోగలిగారు. ఇప్పుడు తాను ఇచ్చిన స్టేట్ మెంట్లు కూడా తనకివ్వాలని పిటిషన్ వేశారు. దేశంలో మరే కేసులోనూ నిందితులు ఇలాంటి పిటిషన్లు వేసి ఉండరన్న ఆశ్చర్యం న్యాయవాద వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఆ రోజున విచారణలో ఏదైనా చెప్పకూడనిది చెప్పారేమోనని అందుకే ఇంత కంగారు పడుతున్నారు.. వాటిని కోర్టు ద్వారా తీసుకుని… మార్ఫింగ్ చేశారని ఆరోపించే ప్రయత్నం ఏదో చేయబోతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సీబీఐ దర్యాప్తు బృందాన్ని మార్చారు. నెలాఖరు వరకు సుప్రీంకోర్టు గడువు ఇచ్చింది. కానీ కొత్త బృందం ఇంత వరకూ రంగంలోకి దిగలేదు. మళ్లీ వారు మొదటి నుంచి ప్రారంభిస్తారా మధ్యలో నుంచా అన్నదానిపై స్పష్టత లేదు. కానీ వివేకా హత్య కేసు నిందితులు.. అనుమానితులు మాత్రం హై గేమ్ ఆడుతున్నారు. వీలైనంతగా బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు.