ప్రీమియర్ షోల సంస్కృతి హాలీవుడ్ నుంచే వచ్చింది. అక్కడ ఫస్ట్ కాపీ రెడీ అవ్వడానికీ, సినిమా విడుదలకు మధ్య చాలా గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్లో ప్రీమియర్ షోలు ప్లాన్ చేస్తారు. కొన్ని వర్గాల ప్రేక్షకులకు సినిమాని చూపిస్తారు. వాళ్ల ఫీడ్ బ్యాక్ తీసుకొని, మార్పులూ, చేర్పులూ చేసుకొంటారు. ఆ తరవాతే విడుదల చేస్తారు. ఇప్పుడు టాలీవుడ్ లో కొన్ని సినిమాలు ఇదే ఫార్మెట్ ని నమ్ముకొంటున్నాయి. దిల్ రాజు కూడా ఇదే ఫార్మెట్ కే ఓటేశారు. ఇక నుంచి తాను తీసే సినిమాలకు ఈ పద్ధతి పాటిస్తానని అంటున్నారు. ”హాలీవుడ్ లో ఓ సినిమా పూర్తయ్యాక… ప్రీమియర్లు విరివిగా వేస్తారు. ఇండియాలో కూడా కొన్ని షోలు నడుస్తాయి. నేనూ అదే పద్ధతి ఫాలో అవ్వాలనుకొంటున్నా. ‘బలగం’ సినిమాకి అదే చేశా. ఆ సినిమా ముందే చూపించడం వల్ల మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. చిన్న సినిమాలకు ఈ పద్ధతి బాగా ఉపకరిస్తుంది. పెద్ద సినిమాలకు ఎలాగూ జనాలు వస్తారు. థియేటర్లు నిండుతాయి. కథని నమ్మి తీసే కొన్ని సినిమాలకు ప్రీమియర్లు అవసరం. మౌత్ టాక్ వల్ల.. జనాలు థియేటర్లకు వస్తారు” అని చెప్పుకొచ్చారు దిల్ రాజు. ఇప్పుడు `శాకుంతలం` సినిమాకీ ఇదే పద్ధతి పాటిస్తున్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. ఈనెల 14న విడుదల అవుతోంది. ఈరోజు నుంచే ప్రీమియర్ల హడావుడి మొదలైంది. సోమవారం హైదరాబాద్ లో ఓ షో వేశారు. బుధవారం మీడియాకు మరో షో ఉంది.