విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు తొలి అడుగు అని ప్రచారం జరుగుతున్న ఓ బిడ్ లో పాల్గొనాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. సంగిరేణిని ముందు పెట్టాలనుకుంటోంది. అసలు నిజంగా బిడ్ పొందాలనే ఆలోచన తెలంగాణ సర్కార్ కు లేదని.. కేవలం బిడ్ లో పాల్గొంటే.. కేంద్రంపై తమ పోరాటం.. ఏపీలోకి తమ ఎంట్రీ సాఫీగా సాగుతుందన్న అంచనాకు వచ్చింది. అయితే ఇలా పాల్గొనడం వల్ల హోంగ్రౌండ్లో ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుందని మాత్రం ఊహించలేకపోతున్నారు.
తెలంగాణ ఉద్యమం సమయంలో మూతపడ్డ పరిశ్రమలను తాము అధికారంలోకి వస్తే వంద రోజు హామీలు ఇచ్చారు. నిజాం షుగర్స్, ఆజంజాహీ మిల్లు, ప్రాగా టూల్స్, ఆల్విన్, హెచ్ఎంటీ, హెచ్సీఎల్, ఐడీపీఎల్.. ఇవేమీ తెరవలేదు. బయ్యారం ఉక్కు కోసం ” కేంద్రం గీంద్రం జాంతానై .. సింగరేణి ఆధ్వర్యంలో మైనింగ్ జేపిచ్చి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ప్రారంభం చేస్తా’అని ప్రకటించారు. కానీ ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ గురించే ఎక్కువ ఆందోళన చెందుతున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్ వేయాలని కేసీఆర్ అనుకోవడం ఖచ్చితంగా రాజకీయ వ్యూహమే. అందులో సందేహం లేదు. కేంద్ర సంస్థల్ని.. మోదీ సర్కార్ ప్రైవేటు పరం చేస్తోందని.. వాటిని తాము కాపాడతామని కేసీఆర్ నిరూపించాలనుకుంటున్నారు. అయితే ఇక్కడ ఆయన పణంగా పెడుతోంది తెలంగాణ ప్రజల సొమ్ము. ఆ బిడ్ వస్తుందా రాదా అన్న సంగతి పక్కన పెడితే.. వస్తే మాత్రం ఖచ్చితంగా వదిలించుకోలేని పరిస్థితి ఎదురవుతుంది. అక్కడి వరకూ వెళ్లకపోయినా ఇప్పుడు తెలంగాణ సమాజంలో జరిగే చర్చ వేరు. తెలంగాణలో ఎన్నో ఉండగా.. చివరికి మాటిచ్చినవే ఎన్నో ఉండగా.. ఎక్కడో విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు కేసీఆర్ కంగారు పడుతున్నారనే.
తెలంగాణ ప్రజల్లోనూ ఇటీవల కేసీఆర్ రాజకీయంపై చర్చ జరుగుతోంది. ప్రగతి భవన్ లో ఇతర రాష్ట్రాల వారికి విందులు ఇస్తున్నారు కానీ తెలంగాణ సామాన్య ప్రజలకు ఎంట్రీ ఉండదు. పైగా తెలంగాణ ప్రజల సొమ్ముతో ఆయన దేశవ్యాప్తంగా రాజకీయం చేయాలనుకుంటున్నారన్న చర్చ కూడా జరుగుతోంది. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ విషయం పై తేడా జరిగితే.. .. ప్రజలలో మరింత వ్యతిరేక ప్రబలే అవకాశం ఉంది. అదే జరిగితే ఏపీలో వచ్చే రాజకీయ లబ్ది కన్నా తెలంగాణలో జరిగే నష్టం ఎక్కువగా ఉంటుంది.