భారత రాష్ట్ర సమితి గా మారిన తర్వాత తొలిగా.. ఆవిర్భావ వేడుకల్ని ఘనంగా నిర్వహించుకోవాలని చేస్తున్న ప్రయత్నాలు ఎప్పటికప్పుడు విఫలమవుతున్నాయి. ఈ సారి ఆవిర్భావ దినోత్సవానికి కూడా సన్నాహాలు ప్రారంభించారు. ఏప్రిల్ 25న నియోజకవర్గస్థాయి పార్టీ ప్రతినిధుల సమావేశాలు హైదరాబాద్లో నిర్వహించాలని నిర్ణయించిన పార్టీ నాయకత్వం పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో 27వ తేదీన ఆవిర్భావ దినోత్సవం జరపనుంది. అదే రోజు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ అధ్యక్షతన జనరల్ బాడీ సమావేశం కూడా నిర్వహిస్తున్నారు.
అయితే బహిరంగసభ లాంటివేమీ పెట్టడం లేదు. గతంలో ఇలా భారీ బహిరంగసభ వరంగల్ లో పెట్టాలనుకున్నారు. కానీ వరుసగా వాయిదాపడి చివరికి మర్చిపోయారు. ఇప్పుడు బహిరంగసభను అక్టోబర్ 10న పెట్టాలనుకుంటున్నారు. అప్పటికి ఎన్నికల షెడ్యూల్ వస్తుంది. లేకపోతే … వచ్చే సమయం దగ్గరకు వచ్చేసి ఉంటుంది. అంటే ఎన్నికల ప్రచార సన్నాహాక సభగా పెట్టాలని అనుకుంటున్నారు. కారణం ఏదైనా పార్టీ ఆవిర్భావ వేడుకలు.. ప్లీనరీలు..సభలు అనుకున్న విధంగా నిర్వహించలేకపోతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
కంటి వెలుగు ప్రారంభోత్సవం సందర్భంగా ఖమ్మంలో బహిరంగసభ నిర్వహించారు. కానీ తర్వాత సికింద్రాబాద్ సభ వాయిదా పడింది. మళ్లీ విపక్ష నేతలందరినీ పిలిచి సభ పెట్టే ఆలోచన ఉందో లేదో స్పష్టత లేదు. సచివాలయ ప్రారంభోత్సవ ముహుర్తాన్ని ఖరారు చేశారు కానీ… సభ గురించి ఎక్కడా చెప్పడం లేదు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ .. జాతీయ రాజకీయాలు… ఇటు రాష్ట్ర రాజకీయాలను సమన్వయం చేసుకోవాల్సి రావడంతో నిర్ణయాలు ఆలస్యమవుతున్నాయని అంటున్నారు.